ధరల్లో ఊరగాయాలు | - | Sakshi
Sakshi News home page

ధరల్లో ఊరగాయాలు

May 29 2026 12:04 AM | Updated on May 29 2026 12:04 AM

చుక్కల్లో మామిడి ధర

ఆవకాయ రుచికి దూరం

భారీగా పెరిగిన ముడిసరకు

నిల్వ పచ్చళ్ల తయారీపై ప్రభావం

ఆలమూరు: ఘుమఘుమల సమ్మేళనం ఆవకాయ గొప్పదనం.. మామిడి కాయలు, గుంటూరు కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు, పప్పు నూనె కలిపి తయారు చేసే ఆవకాయకు అమృతపు రుచి వస్తోంది.. వేసవిలో ప్రతి ఇంటా ఈ తయారీ మొదలవుతుంది. తెలుగువారి నోట ఆవకాయ ముద్ద పడందే తృప్తి ఉండదు. దేశాలు దాటినా ఆవకాయ వాసన మాత్రం తెలుగువారిని తనవైపు లాక్కుంటుంది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్లు తెలుగువారి సంస్కృతిలో ఒదిగిపోయిన ఈ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఆ అనుభూతి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల ప్రతి ఒక్కరి మదిలో ఈ రుచి పెనవేసుకుంది. నోరూరించే ఈ ఊరగాయలను తయారు చేసుకోవడం పెను భారమైంది. వంద మామిడి కాయలు కొనుగోలు చేస్తే సుమారు ఐదు కుంచాల ముక్కలు అవుతాయి. ఒక్కో కుంచం పచ్చడికి రూ.నాలుగు వేల వరకూ ఖర్చు అవుతుంది. వందకాయల ఆవకాయ పచ్చడి పెడితే దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం అన్నిచోట్ల పచ్చళ్ల సీజన్‌ ఊపందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, వేరుశెనగ, గానుగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరకు కొరత అధికమైంది. ఈ ప్రభావం పచ్చళ్ల తయారీపై పడింది.

తగ్గిన వ్యాపారం

ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో, రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ, తుని, మండపేటలోని తదితర హోల్‌సేల్‌ మార్కెట్‌లో పచ్చడికి ఉపయోగించే మామిడికాయల ఽవ్యాపారం ఈ ఏడాది తగ్గిపోయింది. ఆ మార్కెట్‌లకు ప్రతి రోజూ నూజివీడు, కత్తిపూడి, జగ్గంపేట తదితర చాగల్నాడు, మెట్ట ప్రాంతాల నుంచి పచ్చళ్ల తయారీకి వినియోగించే మామిడి రకాలు గతంలో వందల టన్నుల్లో రాగా, ప్రస్తుతం పదుల సంఖ్యలోకి పడిపోయింది. గ్రామీణ ప్రాంత వ్యాపారులు అక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న మామిడికాయలను పరిసర ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మామిడికాయ రకాన్ని బట్టి ధర నిర్ణయించ బడుతుంది.

ఎంతో ఇష్టంగా..

ఆవకాయ, మాగాయ, ఉల్లి ఆవకాయ తదితర పచ్చళ్లు అంటే అందరూ ఇష్టపడతారు. తొలి ఏడాది అత్తవారింటికి కోడలు తప్పనిసరిగా పచ్చళ్లు కావడి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చళ్ల కావళ్లు స్థోమతను బట్టి ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం పెళ్లింట కూడా పడింది. పెళ్లిళ్లలో ఇటీవల తరచూ ఆవకాయ అన్నం, ఆవకాయ ఫ్రైడ్‌రైస్‌, ఆవకాయ పులిహోర, ఆవకాయ బిర్యానీ వంటి వంటకాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగింటి లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆవకాయను వడ్డించకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ ఆవకాయ తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతోంది.

పచ్చళ్ల తయారీలో ఉపయోగించే ముడిసరకుల ధరలు ఇలా

సరకులు గత ఏడాది ఈ ఏడాది

కిలో ధర కిలో ధర

అవకాయ కారం 400 650

మాగాయ కారం 310 550

గానుగ నూనె 380 450

వేరుశెనగ నూనె 180 270

ఆవాలు 150 220

మెంతులు 120 170

వెల్లుల్లి 200 250

ఉప్పు 12 20

పరిమితంగానే తయారీ

పెరిగిన మామిడికాయ, ముడి సరకుల ధరతో ఊరగాయ పెట్టడం పెనుభారంగా మారింది. దీనివల్ల పరిమితంగానే ఆవకాయ, మాగాయి పచ్చళ్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది వరకూ ఈ పచ్చళ్లు సరిపోవు. మార్కెట్‌ ముడి సరకుల ధరలు ఎప్పుడూ ఇంతలా పెరగలేదు.

–పి.శివకల్యాణి, నార్కెడిమిల్లి,

ఆత్రేయపురం మండలం

Advertisement
 
Advertisement
Advertisement