గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

May 29 2026 12:04 AM | Updated on May 29 2026 12:04 AM

పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు రూరల్‌ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్‌ సైకిల్‌పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.

మద్యం మానుకోమన్నందుకు కుమారుడి ఆత్మహత్య

తుని: మద్యం అలవాటు మానుకోవాలని తండ్రి చెప్పిన మాటలకు మనస్తాపం చెందిన కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ త్రినాథరావు కథనం ప్రకారం. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు పెద్దిరాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు పులుగు అనిల్‌కుమార్‌ (25) లారీ డ్రైవర్‌. వీరు ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం అలవాటు ఉన్న అనిల్‌కుమార్‌ను తండ్రి పెద్దిరాజు మద్యం తాగడం మానేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పాడు. దీంతో అనిల్‌కుమార్‌ బుధవారం రాత్రి మోటారు సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రావికంపాడు – అన్నవరం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నవరం రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ త్రినాథరావు తెలిపారు.

3న కాకినాడలో

క్రికెట్‌ జట్టు ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 3న కాకినాడ ఆర్‌ఎంసీ మైదానంలో జిల్లా క్రికెట్‌ క్రీడాకారిణుల ఎంపికలు జరుగుతాయని సంఘ కార్యదర్శి నక్కా వెంకటేష్‌ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు సీనియర్‌ మహిళలు, అండర్‌–23, 19, 15 బాలికల విభాగాల్లో ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల వారు అర్హత ధ్రువపత్రాలు, క్రికెట్‌ డ్రస్‌, షూతో హాజరుకావాలని ఆయన కోరారు.

బావిలో పడిన అప్పన్నెద్దు

బయటకు తీసిన స్థానికులు

తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల చెంతన ప్రమాదవశాత్తూ అప్పన్నెద్దు బావిలో పడింది. ఇరుకుగా ఉన్న బావిలో పడడంతో సుమారు రెండు గంటలకుపైగా అప్పన్నెద్దు నరకయాతన అనుభవించింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని చాలాసేపు తాళ్లతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో స్థానిక కాంట్రాక్టరు మంథా కృష్ణమూర్తి (నాని) జేసీబీని తీసుకువచ్చి బావికి సమాంతరంగా తవ్వారు. తరువాత బావి వరను పగులగొట్టి అప్పనెద్దును జాగ్రత్తగా బయటకు లాగారు. మానవత్వంతో అప్పన్నెద్దును బయటకు తీసి కాపాడిన వారందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌

కొబ్బరి రకం ధర (రూ.ల్లో)

కొత్త కొబ్బరి (క్వింటాల్‌) 20,000 – 22,500

కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000

కురిడీ కొబ్బరి (పాతవి)

గండేరా (వెయ్యి) 26,000

గటగట (వెయ్యి) 23,500

కురిడీ కొబ్బరి (కొత్తవి)

గండేరా (వెయ్యి) 25,000

గటగట (వెయ్యి) 22,500

నీటికాయ

పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000

కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000

కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000

కిలో 350

Advertisement
 
Advertisement
Advertisement