కాల్వష్యం పట్టదా? | - | Sakshi
Sakshi News home page

కాల్వష్యం పట్టదా?

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

ఇక్కడి చెత్త తొలగించకపోతే...

అక్కడ పూడిక తీత పనులు నిరుపయోగం

కాల్వ గట్టుపై వేసిన మట్టి గుట్టలను

తొలగించకపోతే మళ్లీ కాలువలోకే..

అమలాపురం టౌన్‌: ప్రస్తుత కాల్వల క్లోజర్‌ సమయంలో అమలాపురం ప్రధాన పంట కాల్వలో చెత్త, పూడికల తీత పరంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల కాల్వలు కలుషితం అవుతున్నాయి. ఇందులో అమలాపురం మున్సిపాలిటీ నిర్లక్ష్యం కూడా ఉంది. పట్టణ పరిధిలోని కాల్వలో తక్షణమే చేపట్టాల్సిన పనులు లేకపోవడం కూడా శాపంగా మారింది. అమలాపురం ప్రధాన పంట కాల్వ పట్టణం మీదుగా ప్రవహిస్తుంది. నల్లవంతెన – ఎర్ర వంతెన మధ్య దాదాపు కిలోమీటరు మేర ప్రవహిస్తున్న ఈ పంట కాల్వ అసలు రంగు ప్రస్తుత క్లోజర్‌ సమయంలో బయటపడింది. కాల్వలో దాగి ఉన్న చెత్త గుట్టలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదే పంట కాల్వలో ప్రవహించే గోదావరి జలాలను అమలాపురం రూరల్‌, ఉప్పలగుప్తం మండలాల్లో తాగునీటి ప్రాజెక్టులకు వినియోగిస్తారు. పంట కాల్వలో పేరుకు పోయిన చెత్తను కనీసం కాల్వ క్లోజర్‌ సమయంలోనైనా తొలగించాలని అమలాపురానికి చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం అమలాపురం పట్టణ పరిధిలోనైనా కాల్వలోని చెత్త గుట్టలను తొలగించాలని మున్సిపాలిటీని కోరుతున్నారు. ఇదే సమయంలో పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి నల్ల వంతెన వరకూ పంట కాల్వ గట్టు చెంత ఎక్కడ నుంచో తరలించిన మట్టి గుట్టలను వరసగా ఉంచారు. ఈ గుట్టలను తక్షణమే తొలగించకపోతే అదే మట్టి గాలికో, వర్షాలకో మళ్లీ కాల్వలోకి జారి పోయి మరింత పూడుకుపోతుంది. మున్సిపాలిటీ ఈ మట్టి గుట్టలను కాల్వ గట్టు నుంచి తొలగించకపోవడంతో బుధవారం ఉదయం కురిసిన వర్షానికి మట్టి కొంచెం కరిగి మళ్లీ కాల్వలోకి జారింది. ఇదే ప్రధాన పంట కాల్వలో చల్లపల్లి వద్ద ఇప్పటికే జేసీబీతో మట్టి పూడికతీత పనులు జరుగుతున్నాయి. అమలాపురంలోని నల్లవంతెన – ఎర్ర వంతెన మధ్య కాల్వలో పేరుకు పోయిన చెత్తను తొలగించకుండా చల్లపల్లి కాల్వలో పూడికతీత పనులు చేసినా నిరుపయోగమే. కాల్వకు నీరు వదిలిన తర్వాత అమలాపురం కాల్వలోని చెత్త కొట్టుకు వచ్చి పూడిక తీసిన ప్రదేశాల్లో పడి సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అమలాపురం పంట కాల్వలోని పేరుకు పోయిన చెత్తను, శ్మశానం నుంచి నల్లవంతెన వరకూ కాల్వ గట్టు మీద వేసిన మట్టి గుట్టలను మున్సిపాలిటీ తక్షణమే తొలగించాలి. లేదంటే క్లోజర్‌ సమయంలో ఇరిగేషన్‌ శాఖ చేపట్టిన పనులన్నీ వృథా అవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement