జగన్‌ కలిసిన జగ్గిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

జగన్‌ కలిసిన జగ్గిరెడ్డి

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

రావులపాలెం: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రావులపాలెం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొవ్వూరి సూర్యనారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీశైలం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని వారు జగన్‌కు అందజేశారు.

ముస్లింలకు జగ్గిరెడ్డి

బక్రీద్‌ శుభాకాంక్షలు

కొత్తపేట: ముస్లిం సోదర, సోదరీ మణులకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఇంగ్లిషు పరీక్ష వాయిదా

ముమ్మిడివరం: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జరగాల్సిన ఇంగ్లిష్‌ పరీక్షను బక్రీద్‌ పండగ సెలవు కారణంగా వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌స్కూలు పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు కూడా వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు.

17 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

సఖినేటిపల్లి: మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో మంగళవారం రాత్రి వీచిన పెనుగాలులకు, పిడుగుల ప్రభావానికి వివిధ గ్రామాల్లో 17 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్టు ఎలక్ట్రికల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బి.ప్రసాద్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 11 కేవీ ఇన్సులేటర్లు చాలాచోట్ల ధ్వంసం అయినట్టు పేర్కొన్నారు. రెండు మండలాల్లో కొబ్బరి చెట్లు విరిగి పడి 14 విద్యుత్‌ పోల్స్‌ దెబ్బతిన్నాయన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 48 గంటలు పడుతుందన్నారు.

ఇసుక లారీలపై 47 కేసులు

అమలాపురం రూరల్‌: ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ నెలలో ఇసుక లారీలపై 47 కేసులు నమోదు చేసి రూ.2.80 లక్షల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసిన రవాణా వాహనాలు బస్సులు, లారీలు, క్యాబ్‌లకు వీఎల్‌టీడీ (వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైస్‌) పరికరం అమర్చుకోవాలని, ఇది వాహన యజమానుల బాధ్యత అని డీటీవో తెలిపారు.

ఏఎస్పీ ప్రసాద్‌కు

ఎస్పీగా పదోన్నతి

అమలాపురం టౌన్‌: ఏఎస్పీగా పనిచేస్తున్న ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. పదోన్నతితో ఆయనకు ఈ జిల్లా నుంచి బదిలీ అనివార్యమైంది. ఎస్పీ పదోన్నతి లభించిన ఏఎస్పీ ప్రసాద్‌ను మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్డర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈయన నాలుగైదు రోజుల్లో జిల్లా నుంచి రిలీవ్‌ కానున్నారు. ప్రసాద్‌ ఏఎస్పీగా 2024 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్‌ను ఎస్పీ రాహుల్‌ మీనాతోపాటు ఎస్పీ కార్యాలయం సీఐలు, ఎస్సైలు అభినందించారు.

వేగంగా రీ–సర్వే

అమలాపురం రూరల్‌: రీ–సర్వే ప్రగతిని నిరంతరం ఆన్‌లైన్‌ చేయాలని, డిజిటల్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని జేసీ నిడియాదేవి తహసీల్దారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తహసీల్దారులతో సమావేశం నిర్వహించి రీ సర్వే పురోగతిపై సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement