ఆలమూరు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) పదోన్నతుల బదిలీ సీనియారిటీ ప్రాతిపదికనే జరిగింది. సాక్షి దినపత్రికలో ఈ నెల 25న ‘ఇవే పన్నులో బాబూ..’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ తొలుత సీనియారిటీ ప్రకారం కాకుండా ఇంటి పన్నుల చెల్లింపుల శాతం ఆధారంగా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జీఓ జారీ చేశారు. దీనిపై సాక్షి పత్రికలో కథనం రావడంతో సోమవారం వరకూ పంచాయతీరాజ్ వెబ్‌బ్‌సైట్‌లోని పీడీఓలో ఉన్న ఇంటిపన్నుల శాతం తెలిపే వివరాల షీట్ లింకును తొలగించారు. ఆయా జిల్లాల్లో పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పూర్వపు విధానంలోనే కౌన్సెలింగ్ జరిగింది. సర్వీస్ రూల్స్ ప్రాతిపదికగానే ప్రస్తుతం కౌన్సెలింగ్ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌కు, కథనం ప్రచురితం చేసిన సాక్షికి పీడీఓలు ధన్యవాదాలు తెలియజేశారు.
పూతరేకుల దుకాణాల్లో తనిఖీలు
ఆత్రేయపురం: ఉచ్చిలి, ఆత్రేయపురం సమీపంలోని పూతరేకుల తయారీ, విక్రయాలు జరిపే దుకాణాల్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.రామయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయా దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యిని పరిశీలించారు. స్థానికంగా కొందరి నుంచి కల్తీ నెయ్యిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించి, రిపోర్టులు వచ్చిన అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తామని వై.రామయ్య తెలిపారు. పూతరేకుల పరిశ్రమ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున ఇక్కడి తయారీదారులు బ్రాండెడ్ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నందున నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యాపారులకు తెలిపారు. తనిఖీలో వైద్య శాఖ సిబ్బంది పీహెచ్ అరుణకుమారి, సూపర్ వైజర్ మూర్తి, వీఆర్వో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్ర స్థాయి అవార్డు
అమలాపురం రూరల్: సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్రస్థాయిలో టాప్ ఫెర్పార్మర్ అవార్డు లభించింది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం ఆమెకు డివిజన్ సంక్షేమ అధికారులు భగవాన్, సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ప్రవీణ్, కోశాధికారి బీఎంవీ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు అభినందనలు తెలిపారు. జ్యోతిలక్ష్మీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఫలితంగా తనకు అవార్డు దక్కిందని స్పష్టం చేశారు.


