అమలాపురం రూరల్: జాతీయ జనగణన ప్రక్రియలో అత్యంత కీలకమైన గృహాల గణనను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమరావతి నుంచి ఏపీ జనగణన నోడల్ అధికారి ప్రత్యేక కమిషనర్ ఎస్‌ఎస్ రావత్, జనగణన డైరెక్టర్ జె.నివాస్ మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు చొరవ చూపి నిర్దేశిత కాలవ్యవధి నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ సేవల్లో అసత్వం వహించొద్దని ఆదేశించారు. జిల్లాలో నాన్ రెసిడెంట్ కేరళీస్ ఫుడ్స్ సహకారంతో, కొబ్బరి ఆధారిత విలువధారిత ఆహార ఉత్పత్తుల స్థానిక తయారీ సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం పక్కాగా అమలు కావాలని, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు చేయాలన్నారు. అలాగే జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు.


