చమురు ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేట్రేగిపోతున్నాయి.. ఎక్కడా ఆగకుండా బాదేస్తున్నాయి.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.. ఈ పెంపు రవాణా, నిత్యావసరాలకు ధరాఘాతం కానున్నాయి.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మనకే ఎక్కువ ధరలు ఉండడం సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారుపై అన్నివర్గాలూ దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఆలమూరు: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీగా చమురు ధరలు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెంచేసింది. పెట్రోల్, డీజిల్‌పై 11 శాతం మేర ధరలను పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోంది. కోనసీమ జిల్లా వ్యాస్తంగా హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)తో పాటు రిలయన్స్, నయారా తదితర ప్రైవేట్ కంపెనీలకు చెందిన 112 పెట్రో బంకులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోజూ సుమారు 2.40 లక్షల లీటర్ల పెట్రోల్, 3.25 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఈ నెల 14వ తేదీన పెట్రోల్ ధర రూ.109.39, డీజిల్ రూ.97.24 ఉంది. ప్రస్తుతం నాలుగో సారి పెంపుతో పెట్రోల్ ధర రూ 117.21, డీజిల్ ధర 104.93కు చేరింది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్‌పై రూ.8.04, డీజిల్‌పై రూ.7.82 పెంచినట్లు అయ్యింది. ఇలా జిల్లా వాసులపై రోజుకు సుమారు రూ.65 లక్షల భారం పడనుంది. దేశంలోనే అత్యధిక చమురు ధర ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ తగ్గించి ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్‌ను చేస్తూనే ఉంది. అయినా చంద్రబాబు సర్కారు ప్రజలపై భారం వేస్తోంది.
ఇదే‘వంట’ భారం
పెరిగిన గ్యాస్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పెట్రో ధరల పెంపు మరింత భారంగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పేట ధరల దాడి చేస్తున్నాయి. ఇప్పటికే రవాణా చార్జీలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాలుగోసారి పెరిగిన చమురు ధరలతో మరింత పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రి పాయింట్ల యజమానులు ధరలను భారీగా పెంచేశారు. టిఫిన్, మీల్స్‌పై ఇప్పటికే ప్లేట్‌కు రూ.పది నుంచి రూ.25 వరకూ పెరిగిపోయింది. ఆటోల్లో కనీస చార్జీలకు రెక్కలొచ్చాయి. కూరగాయల ధరల చుక్కలన్నంటుతున్నాయి. ఈ చమురు ధరల పెంపు ఇలా కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఉపశమన చర్యలు అవసరం
పెట్రో ఉత్పత్తుల ధరలు నియంత్రణ లేకుండా పెరగకుండా సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అందరి నుంచి వస్తుంది. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడతామంటున్న చంద్రబాబు సర్కార్ చమురు ధరల తగ్గింపులో పోటీపడాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో భారీగా ఉన్న వ్యాట్‌ను తగ్గించడంతో పాటు రోడ్డు సెస్‌ను రద్దు చేయాలనే డిమాండు వ్యక్తమవుతుంది.
ద్విచక్ర వాహనంలో పెట్రోల్ నింపుతూ..
తేదీ పెట్రోల్ ధర పెంపు డీజిల్ ధర పెంపు
(రూపాయల్లో) (రూపాయల్లో)
14.05.26 (నాటికి) 109.39 97.24
15.05.26 3.29 3.14
19.05.26 0.87 0.91
23.05.26 0.87 0.91
25.05.26 2.79 2.73
117.21 104.93
ఆగని చమురు ధరల పెంపు
ప్రజలపై వరుసగా వడ్డింపు
పది రోజుల్లో పెట్రోల్‌పై
రూ.8.04, డీజిల్‌పై రూ.7.82 భారం
జిల్లాలో రోజుకు
రూ.65 లక్షల అదనం


