అమలాపురం రూరల్: అంబాజీపేట మండలం చిరుతపూడి పంచాయతీ పరిధిలో ప్రభల తీర్థం జరిగే పంట చేల స్థలంలో విద్యుత్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆ గ్రామస్తులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. మందపల్లి నుంచి అయినవిల్లి మండలం వరకూ 400 కేవీ విద్యుత్ టవర్ ఏర్పాటుతో సంకాంత్రికి జరిగే తీర్థానికి ఆటంకం కలుగుతుందని ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు సోమవారం ఆందోళన చేశారు. ఈ పొలాల నుంచి ఈ నిర్మాణం వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరుతపూడి, కుందాలపల్లి, మోడేకుర్రు, అవిడి, నరేంద్రపురం, రాకుర్తివారిపాలెం–గొల్లకోటివారిపాలెం గ్రామాల్లో శివాలయాల నుంచి ప్రభలతో పాటు ప్రతి గ్రామం నుంచి ప్రభలను చిరుతపూడి గ్రామ తీర్థ స్థలానికి తీసుకు వస్తారన్నారు. మందపల్లి నుంచి అయినవిల్లి 400 కేవీ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్‌కు హైపవర్ లైన్ ప్రభల తీర్థం జరిగే స్థలం మధ్యలో నుంచి వెళ్తుందని వారు తెలిపారు. ఈ స్థలం మధ్యలో సుమారు 10 సెంట్ల స్థలంలో హైపవర్ విద్యుత్ టవర్ నిర్మిస్తామని అధికారులు చిరుతపూడి గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారన్నారు. దీనిపై తాము అభ్యంతరం తెలిపామన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్మాణ పనులు చేస్తామంటున్నారని అన్నారు. దీనిని నిరసిస్తూ మాజీ సర్పంచులు కోట బేబీరాణి, సరేళ్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు ధూళి సూరిబాబు, నేతల నాగరాజు, గ్రామ పెద్దలు కలెక్టర్‌ను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కలసి వినతిపత్రం అందించారు.
ఆక్వా సమస్యలు పరిష్కరించండి
ఆక్వా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రొయ్యల చెరువులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. రొయ్యల ధరలు పెంచాలని, వాటి మేత ధరలు తగ్గించాలని ఆక్వా రైతు నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు, చవటపల్లి నాగభూషణం డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు రాజు మాట్లాడుతూ సిండికేట్ వ్యవస్థ కారణంగా ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సిండికేట్‌ను విచ్ఛిన్నం చేయాలని డిమాండ్ చేశారు. నాగభూషణం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.


