అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. ప్రతి అర్జీదారుడితో ఎస్పీ మీనా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి అధికారులతో చర్చించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి.
పోలీస్ ఉద్యోగంలో
మానసిక దృఢత్వం ముఖ్యం
అమలాపురం టౌన్: పోలీస్ ఉద్యోగంలో మానసిక దృఢత్వం ముఖ్యమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్థానిక కూచిమంచి అగ్రహారంలోని ఎస్‌ఆర్‌సీఎం హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్‌లో జిల్లా పోలీసు అధికారులకు సోమవారం ధ్యాన తరగతులను ఆయన ప్రారంభించారు. రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఎ.రాజశేఖర్, ఎం.బాలక్షృష్ణ పర్యవేక్షణలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన నిర్వహించారు. హృదయ ఆరోగ్య పరిరక్షణ, క్రమబద్ధమైన వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అంశాలపై ఆరోగ్య నిపుణులు సూచనలు ఇవ్వడమే కాకుండా పోలీసు అధికారులతో యోగా, ధ్యానం చేయించారు. ఎస్పీ మీనాతో పాటు జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి రోజూ ఉదయం కొంత సమయం యోగా, ధ్యానం వంటి ఆరోగ్య కార్యక్రమాలకు కేటాయించాలని ఎస్పీ మీనా సూచించారు.
పీడీ సెట్‌లో ఏడో ర్యాంక్
రాజోలు: పోస్ట్ డిప్లొమా సెట్ (పీడీ సెట్)లో రాజోలు ఏనుగుపల్లివారి పేటకు చెందిన డాక్టర్ రీనా రివాంజలిన్ ఆల్ ఇండియా స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నిర్వహించిన పీడీ సెట్‌లో జాతీయ స్థాయిలో ఏడో ర్యాంక్ సాధించిన డాక్టర్ రీనా రివాంజలిన్‌ను సోమవారం పలువురు అభినందించారు. రివాంజలిన్ ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా, ఆమె భర్త డాక్టర్ వై.జాషువా గుంటూరు మెడికల్ కళాశాలలో ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఉత్సాహంగా రేలా ఉత్సవాలు
రంపచోడవరం: రంపచోడవరంలో ఆదివాసీ రేలా ఉత్సవాలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె.దినేష్‌కుమార్, జేసీ ప్రశాంత్‌కుమార్ హాజరయ్యారు. గిరిజనులతో కలసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సాయంత్రం ఏడు గంటలకు రేలా ఉత్సవాలు ప్రారంభించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, మెంబర్ గొర్లె సునీత, డీఎఫ్‌ఓ శివకుమార్ గంగల్, ఎంపీపీ బందం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల పెళ్లి తంతు, రేలా నృత్యాలు, గిరిజనుల సంప్రదాయ వస్తువులను ప్రదర్శించారు.


