● అవే సమస్యలపై మళ్లీ అర్జీలు
● నామమాత్రంగా
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: పదే పదే తిరుగుతున్నా పరిష్కారం దొరకడం లేదు.. మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నా పట్టించుకునేవారు కానరావడం లేదు.. దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)పై ప్రజలకు నమ్మకం ఉండడం లేదు. అమలాపురంలోని కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారులకు అర్జీలు ఇస్తున్నా పట్టించుకునే వారు ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 250 మంది అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ సైదియదేవి, డీఆర్వో సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, డీఆర్‌డీ పీడీ డి.రాంబాబుకు వినతిపత్రాలు అందించారు. వీటిలో ఎక్కువ సార్లు వచ్చిన అర్జీదారుల మనోగతం తెలుసుకుందాం..
ఐదు సార్లు ఫిర్యాదు చేశా..
రాజోలులోని వశిష్ఠ లెఫ్ట్ బ్యాంకు వద్ద ఏటుగట్టుపై కొబ్బరి చెట్ల ఫలం సాయం పొందేందుకు మా పెద్దలు 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. ఇదే ఆధారంగా జీవిస్తున్నాం. ఇక్కడి కొబ్బరి చెట్లకు అడ్డుగా ఓ వ్యక్తి బడ్డీ పెట్టాడు. అనుమతి లేకుండా అతను కొన్ని కొబ్బరి మొక్కలు వేశాడు. కొబ్బరి చెట్ల దింపునకు వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. దీనిపై ఇప్పటికి కలెక్టరేట్‌లో ఐదు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. – వెటుగోట్ల విజయలక్ష్మి, రాజోలు
ధ్రువీకరణ ఇవ్వడం లేదు
ఐదేళ్లుగా పక్షవాతంతో మంచంపై ఉన్నాను. ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉందని వృద్ధాప్య పింఛను రాలేదు. అనారోగ్యం కారణంగా మంచంపైనే ఉన్నాను. దీనికి సదరం ధ్రువీకరణ పత్రం కోసం మా కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. వైద్య పత్రాలు లేవని చెప్పి అధికారులు ధ్రువీకరణ ఇవ్వడం లేదు. రెండేళ్లుగా సచివాలయం, ఎంపీడీఓ, కలెక్టరేట్‌లలో అర్జీలు ఇస్తూనే ఉన్నాను.
– ఎం.సుబ్బారావు,
మొగళ్లమూరు, అల్లవరం మండలం


