తాళ్లరేవు: పి.మల్లవరం పోస్టాఫీస్‌లో పొదుపు చేసుకున్న తమ నగదుకు లెక్కలు లేకుండా పోయాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.వేలు జమచేస్తే రూ.వందల్లో ఉన్నట్లు పాస్‌బుక్‌లలో చూపుతున్నారని వాపోతున్నారు. తాము పొదుపు చేసుకున్న నగదును తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని సోమవారం పి.మల్లవరం పోస్టల్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ధూళిపూడి సాయిపవన్ మాట్లాడుతూ పోస్టాఫీస్‌లో తన తండ్రి పేరిట రూ.32,870 జమ చేశానని, అయితే ప్రస్తుతం కేవలం రూ.878 మాత్రమే అకౌంట్ బుక్‌లో చూపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తన తల్లి పేరిట రూ.22977 జమ చేయగా, రూ.1,493 ఉన్నట్లు చెబుతున్నారని వాపోయారు. మిగిలిన సొమ్ము ఏమైందని ప్రశ్నించగా, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అంటున్నారు. సుకన్య పథకం కింద తన మేనకోడలు కూర్మా నాగలక్ష్మి పేరిట రూ.52,500 నగదు జమ చేయగా, కేవలం రూ.21,457 మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారని బాధి తుడు ఆనాల పాపారావు వాపోయాడు. సుమారు 40 మంది బాధితులకు చెందిన రూ.25 లక్షలకు పైగా నగదు కనిపించకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. పాత అకౌంట్ పుస్తకాలను కనిపించకుండా చేసి, కొత్త పుస్తకాలు ఇచ్చారని, వాటిలో తాము దాచుకున్న పూర్తి నగదు లేదని తెలిపారు. దీనిపై జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు.
పెద్దాపురం ఆర్డీఓగా
రాధాకృష్ణమూర్తి
సామర్లకోట : పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనకు సంబంధించి బాధ్యులుగా చేస్తూ అప్పటి ఆర్డీఓగా ఉన్న కే శ్రీరమణని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అనంతరం ఎన్ శ్రీధర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. రెగ్యులర్ ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమించారు.


