● అన్నదాత సుఖీభవలో మొండి చేయి
● నేటికీ రాని మోంథా పరిహారం
● రబీ ధాన్యానికి దక్కని మద్దతు
● ప్రభుత్వ వైఖరితో చేతులెత్తేస్తున్న రైతులు
● సహకరిస్తేనే సాగులోకి అంటున్న వైనం
● మరో పక్క వారం రోజుల్లో
కాలువలకు నీరు
● ఖరీఫ్‌కు సిద్ధం చేస్తున్న అధికారులు
సాక్షి, అమలాపురం: ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టాలో ఇప్పుడు మొదటి పంట సాగు చేసేందుకే రైతులు వెనకాడుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఖరీఫ్ సాగు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నెల 30న లేదా జూన్ 1వ తేదీన కాలువలకు నీరు వదిలేందుకు జల వనరుల శాఖ సిద్ధంగా ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. అన్నదాతలు మాత్రం సాగు భరోసా లేక వెనకాడుతున్నారు. జిల్లాలో మొత్తం వరి ఆయకట్టు 2.20 ఎకరాలు. గత ఏడాది ఖరీఫ్‌లో సుమారు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. రెండేళ్లుగా ఖరీఫ్ పూర్తిస్థాయిలో సాగవడం లేదు. ముంపు భయం, ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. గత ఏడాది సుమారు 40 వేల ఎకరాల్లో సాగుకు దూరంగా ఉన్నారని అంచనా. ఈ ఏడాదీ ఇదే కొనసాగుతుందనే అనుమానాలు నెలకొన్నాయి.
బీమా భరోసా లేదు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. సాగు చేసిన 1.69 లక్షల ఎకరాలకు 43,900 ఎకరాల్లో మాత్రమే బీమా వర్తించింది. దీనిలో 90 శాతం బ్యాంకు రుణాలు ఉన్నవారికే. మిగిలిన రైతులు ఉచిత పంటల బీమా వర్తించక, ప్రభుత్వ పరిహారం అందక నష్టపోతున్నారు.
సాగుకు దూరం
చాలామంది రైతులు తొలకరి పంటకు దూరంగా ఉంటున్నారు. తీర ప్రాంత మండలాలు ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోనల్లో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయడం లేదు. తుపానులు, వరదలకు చేలు ముంపు బారిన పడి నష్టపోవడానికి తోడు పంట నష్టపోతే ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించకపోవడం కూడా కారణం. ఈ ఏడాది అష్టకష్టాలు పడి రబీ పండిస్తే కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకు తగ్గించి అమ్ముకోవాల్సి రావడంతో రైతుల్లో సాగు అంటేనే నిర్లిప్తత చోటు చేసుకుంది.
అన్నదాత సుఖీభవ ఎప్పుడు?
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా (టీడీపీ ప్రభుత్వంలో దీనిని అన్నదాత సుఖీభవగా పేరు మార్చారు) నిధులు విడుదల చేసేవారు. ఖరీఫ్ సాగు ప్రారంభంలోనూ, అక్టోబర్, జనవరిలో ఇలా మూడు దఫాలుగా నిధులు రైతులు ఖాతాలకు జమ చేసేవారు. తాము అధికారంలోకి వస్తే రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. తొలి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రూ.ఆరు వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలకు ఎగనామం పెట్టారు. జిల్లాలో 1,45,899 మంది రైతులకు (మండపేట నియోజకవర్గంతో కలిపి) ఇవ్వాల్సిన రూ.204.25 కోట్లు ప్రభుత్వం ఎగవేసింది. గత ఏడాది జూన్‌లో ఇవ్వాల్సిన నిధులను ఆగస్టులో గాని విడుదల చేయలేదు. లబ్ధిదారులను 1,33,933 మందికి కుదించి 11,957 మందికి అన్నదాత సుఖీభవ నిధులు ఎగ్గొట్టారు.
మోంథా పరిహారం లేదు
మోంథా తుపానువల్ల జిల్లాలో సుమారు 73 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. సుమారు 54 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరగగా, 21 ఎకరాల్లోని పంట నీట మునిగింది. 41 వేల మంది రైతులు నష్టపోయారు. హెక్టారుకు రూ.25వేల చొప్పున మొత్తం 29,544 ఎకరాలకు రూ.73.86 కోట్లు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంది. నవంబర్‌లో పంట దెబ్బతింది. ఆరు నెలలు దాటుతున్నా పరిహారం అందలేదు.


