బొజ్జ గణపయ్యకు విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

బొజ్జ గణపయ్యకు విశేష పూజలు

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి రెండు జంటలు పంచామృతాభిషేకం నిర్వహించారు. అలాగే లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 26 మంది దంపతులు పాల్గొన్నారు. ఒక జంట గరిక పూజ నిర్వహించింది. 13 మంది లక్ష్మీగణపతిహోమంలో పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం వేశారు. 8 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 1224 మంది స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,26,845 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

ముమ్మిడివరం: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సోమవారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు ఏఎస్‌ఎస్‌టీ కమిషనర్‌ బి.హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగుతాయన్నారు. ఈ మేరకు జిల్లాలో 5 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యూలర్‌ టెన్త్‌తో పాటు ఓపెన్‌ స్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్‌లో సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌ గోదావరి భవనంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ మీకోసం, రెవెన్యూ క్లినిక్‌ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి డివిజన్‌, మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారని, అర్జీలను వెబ్‌వైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని పరిష్కారాలు పొందాలని సూచించారు. అర్జీల స్థితిగతుల వివరాల కోసం 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్‌ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

అంబేడ్కర్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజయవాడ జోనల్‌ అధ్యక్షుడు చిరంజీవి

అమలాపురం రూరల్‌: జిల్లాలోని నాలుగు డిపోలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అంబేడ్కర్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజయవాడ జోనల్‌ అధ్యక్షుడు జి.చిరంజీవి అన్నారు. యూనియన్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి.సత్తిబాబు అధ్యక్షతన ఆదివారం అమలాపురంలో జరిగింది. ఏటా డిజిటల్‌ చార్టులు మార్చాలని, బస్సుల సంఖ్య పెంచాలని తదితర డిమాండ్లు చేశారు. అవసరమైతే విజయవాడ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దృష్టికి సమస్య తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాలుగు డిపోల అధ్యక్ష కార్యదర్శులు సహా డిపో కమిటీలు పాల్గొని నూతనంగా జిల్లాకు వచ్చిన జోనల్‌ అధ్యక్షులను జోనల్‌ జాయింట్‌ సెక్రటరీ కేవీఎస్‌ నారాయణను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిపో జిల్లా కార్యదర్శి మేడిది శ్రీనివాసరావుతో పాటు అధిక సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

ఆరుగురు ప్రయాణికులకు గాయాలు

కోదాడ రూరల్‌: ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం బైపాస్‌ వద్ద హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి యోలో ట్రావెల్స్‌ బస్సు 36 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున కోదాడ సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లలో కూర్చున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్‌, విజయవాడ వెళ్లారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు.

24కెడిడి501: క్రేన్‌తో బస్సును రోడ్డు పక్కకు తొలగిస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement