● సత్ఫలితాలు ఇస్తున్న జగన్ ప్రభుత్వ విద్యా సంస్కరణలు
● ఇంగ్లిష్ మీడియంతో టెన్త్‌లో రాణించిన విద్యార్థులు
కొత్తపేట: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు తీసుకువచ్చిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేటు స్కూళ్లకు దీటుగా దూసుకు పోతున్నాయి. గతంలో కార్పొరేటు పాఠశాలలు మాత్రమే ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులను ఆకర్షించి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించేవి. నేడు ప్రభుత్వ టీచర్లు తమ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఘనతను వివరిస్తూ చేరికలకు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
అధిగమించిన ఫలితాలు..: ఈ ఏడాది 12,532 మంది విద్యార్థులకు 11,821 మంది (94.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అయినవిల్లి మండలం నూరు శాతం, 13 మండలాల్లో 96.10 శాతం నుంచి 99.30 శాతం వరకు, 8 మండలాల్లో 87.30 శాతం నుంచి 94.02 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక పాఠశాలల్లో విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనతను చాటి చెబుతూ, వారి పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు వివరిస్తూ ఫ్లెక్సీలతో, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని వివరిస్తూ విద్యార్థులను చేర్పిస్తున్నారు. జిల్లాలో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులు 7,669 మందిని గుర్తించగా నేటి వరకు 3,608 మందిని 1వ తరగతిలో చేర్పించారు.


