ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

ఆర్డీవో సరళవతి

రామచంద్రపురం: రాబోయే వారం రోజుల పాటు డివిజన్‌ పరిధిలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎ. సరళవతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక హీట్‌వేవ్‌ బులెటిన్‌ ప్రకారం జిల్లాతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దాహం వేయకపోయినా తరచూ తగినంత నీరు త్రాగాలని, శరీరంలో లవణాల సమతుల్యత కోసం మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ఉపయోగించడం, తడి గుడ్డతో తలను కప్పుకోవడం మంచిదన్నారు. అలాగే గాలి సులభంగా తగిలే పలుచని, లేత రంగు పత్తి దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, రైతులు వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లో పనులను తగ్గించుకుని, మధ్య మధ్యలో నీడ ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటూ పనులు కొనసాగించాలని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, నీరసం, తల తిరగడం, వాంతులు, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి, ఎండల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని ఆర్డీవో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement