తుని రూరల్: లోవ దేవస్థానంలో వివిధ సేవలకు ఆన్‌లైన్ పేమెంట్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో.. తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం 23 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరందరూ పూజా టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవలకు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు విద్యుత్, ఇంటర్నెట్ మొరాయించడంతో ఆన్‌లైన్ సేవలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. సిబ్బంది అందుబాటులో ఉండి కొంత మేరకు సమస్యను పరిష్కరించినా.. గ్రా మీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కొంత మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, మరి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో నెట్ సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు ఎదురయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కియోస్కులు పని చేసేలా యూపీఎస్‌లు ఏర్పాటు చేశామని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు.
రూ.7 లక్షల ఆదాయం
వివిధ సేవలు, విరాళాల రూపంలో దేవస్థానానికి మొ త్తం రూ.703897 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,13,448, పూజా టికెట్లకు రూ.3,67,702, కేశఖండన శాలకు రూ.19,520, వాహన పూజలకు రూ.4,370, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.86,865, విరాళాలు రూ.13,992 చొప్పున ఆదాయం వచ్చిందని వివరించారు.


