ఎండలతో అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

ఎండలతో అప్రమత్తంగా ఉండండి

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

అమలాపురం రూరల్‌: రానున్న ఐదు రోజులూ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం 19 మండలాల్లో సుమారు 41 నుంచి 54 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లరాదన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకూ 48 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.

ఫ జిల్లాలో జలధార– జల హారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జల హారతి, వివిధ వంతెనల నిర్మాణాలు, రబీ ధాన్యం సేకరణ, డ్రైనేజీల ఆపరేషన్‌ నిర్వహణ నిధులతో కేటాయించిన పనులు పురోగతిపై సమీక్షించారు. పీఆర్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ పి.రామకృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ బి.రాము తదితరులు పాల్గొన్నారు.

ఫ గృహ గణనను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 15,39,357 జనాభా ఉండగా, 87.58 గణన పూర్తయ్యిందన్నారు.

పొదుపు అంటే ఇదేనా బాబూ?

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ప్రజలు తమ కార్లు, మోటారు సైకిళ్లు వదిలేసి సైకిళ్ల బాట పడుతుంటే, కూటమి ముఖ్య నేతలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండి.. అలా కంటే రూ. 30 వేలు, రూ.40 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు సంపద సృష్టి, పొదుపు అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇంధన పొదుపు, సంపద సృష్టి అంటూ ప్రకటనలు చేయడం కాదని, ఆచరణలో తాను చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటున్న చంద్రబాబు అలా పుట్టినప్పుడు రూ. వేలల్లో ఇస్తే సరిపోతుందా..? వారి చదువులు, ఉద్యోగాలు వంటివి గాలికొదిలేస్తారా..? అని తల్లిదండ్రులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు నెల నెలా రూ.1500 ఇలాంటి హామీలకు మంగళం పాడిసినట్లేననిపిస్తోందన్నారు. ప్రభుత్వ విధి విధానాలు అన్నదాతలకు శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఆక్వా రైతులు నేడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.

ఇంటర్‌ పాఠ్య పుస్తకాలు సిద్ధం

అమలాపురం టౌన్‌: వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులకు అందించేందుకు 10,500 ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి (డీఐఈఓ) కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, హైస్కూల్‌ ప్లస్‌ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలను అమలాపురంలో సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆయా కళాశాలలకు పుస్తకాలు చేర్చామన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement