అల్లవరం మండలంలో సముద్ర తీరాన్ని అక్రమార్కులు గుల్లచేస్తున్నారు. ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు, తీరంలో ఇళ్లలో పునాదులు నింపేందుకు ఈ ఇసుకను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. మండలంలో ఓడలరేవు, కొమరగిరిపట్నంలో తీరాన్ని ఆనుకుని ఇసుక దిబ్బలు కనుమరుగయ్యాయి. అడపాదడపా దాడులు చేస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు. కీలక నాయకుల వత్తాసు ఉండడంతో మరింత చెలరేగిపోతున్నారు.
నిబంధనలు ‘పట్టా’పంచల్
మండపేట నియోజకవర్గం పరిధిలో కపిలేశ్వరపురం మండలం తాతపూడి, కేదార్లంక, శ్రీరామపురంలో ఇసుక, మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన పట్టా భూములను కూడా కొల్లగొడుతున్నారు. ఈ తవ్వకాలకు మైనింగ్ శాఖ అధికారులు కూడా వంత పాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార తవ్వకాలకు మార్గం కోనసీమ జిల్లా కావడం గమనార్హం.


