ఫ పెట్రోల్‌పై 97 పైసలు, డీజిల్ 99 పైసల పెంపు
ఫ జిల్లాలో రోజుకు రూ.11 లక్షల భారం
అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. గడిచిన 13 రోజుల్లో ధరల పెంపు ఇది మూడోసారి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.11 లక్షల అదనపు భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా.. రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోల్, 4.80 లక్షల లీటర్ల డీజిల్ చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఈ పెంపుతో జిల్లాలో వినియోగదారులపై రోజుకు సుమారు రూ.11 లక్షల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.113.86 ఉండగాచ శనివారం ఉదయం 6 గంటల నుంచి రూ.114.86కు పెరిగింది. డీజిల్ లీటరు రూ.100.55 ఉండగా, ఇది రూ.102.55కు ఎగబాకింది. 15న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు లీటరుకు రూ.3.41, డీజిల్ 3.26 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వాహనాల రవాణా చార్జీలు పెరుగుతాయని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే మూడోసారి ధరలు పెంచడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వరుస ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు అంటున్నారు.


