అమలాపురం రూరల్: జిల్లా శిశుగృహలో ఉన్న ఆదిత్య అనే ఆరునెలల చిన్నారిని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చేతుల మీదుగా కలెక్టరేట్‌లో శుక్రవారం బెంగళూరుకు చెందిన కృష్ణ ప్రకాష్, నాగజ్యోతి సూర్యకుమార్ దంపతులకు దత్తత ఇచ్చామని ఐసీడీఎస్ పథక సంచాలకులు కె.నాగమణి తెలిపారు. గత డిసెంబర్ 14న గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బాబును వేకువ జామున మండపేట పశువులపాక సమీపంలోని చెత్త కుప్పలో వదిలి వెళ్లారన్నారు. స్థానికులు అమలాపురం శిశు గృహకు అప్పగించారన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న బెంగళూరు దంపతులకు బాబు ఫిబ్రవరి 26న రిజర్వ్ అయ్యాడన్నారు. సీడీపీఓ వైకేడీ రమాదేవి పాల్గొన్నారు.
20 సూత్రాల
కమిటీది కీలక పాత్ర
కమిటీ చైర్మన్ దినకర్
అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో 20 సూత్రాల కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన 20 సూత్రాల ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యం, విద్య, అమృత్ 2.0. జల జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ – అజీవికా మిషన్ గ్రామీణ పథకాల పురోగతిపై సమీక్షించారు. దినకర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీ–జీ రామ్ జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పని దినాలు 125 రోజులకు పెంచిందన్నారు. ఎంపీ జీఎంసీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు దృష్టి సారించాలన్నారు. జేసీ వైఖోడ్ నైదియాదేవి, డీఆర్వో సుబ్బారావు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
అమలాపురం రూరల్: విద్యార్థులు సమయస్ఫూర్తితో ముందుకు సాగాలని డీఆర్‌వో వి.సుబ్బారావు అన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం 2026 మే లో నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ పరీక్షలపై డీఆర్‌వో కలెక్టరేట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 25వ తేదీన తెలుగు, 26న హిందీ, 29న గణితం, 30న భౌతిక శాస్త్రం, జూన్ ఒకటిన జీవశాస్త్రం, జూన్ 2న సామాజిక శాస్త్రం, జూన్ 5న ఇంగ్లిష్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. మే 28న బక్రీద్ కారణంగా జూన్ 5న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సామూహిక వివాహాలకు
రానున్న ఆధ్యాత్మిక ప్రముఖులు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలోని పట్టాలమ్మ అమ్మవారి ఆలయప్రాంగణంలో 28వ తేదీన ఆదివాసీల సామూహిక వివాహ మహోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే.
170 జంటలు ఒకటి కానున్న ఈ కార్యక్రమాన్ని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఈ వేడుకకు దేశం నలుమూల నుంచి తొలిసారిగా రానున్న వారి పేర్లను ఆ సంస్థ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఈ మహా కార్యక్రమానికి త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌తో పాటు విద్యా నృసింహ భారతి, వీరధర్మజస్వామి, ప్రతాప్ స్వామి, బ్రహ్మశ్రీ కడియాల నవీన్ శర్మ, అరుణానంద స్వామి తదితరులు రానున్నట్లు సంస్థ ప్రకటించింది.


