పిఠాపురం రూరల్/సీతానగరం/ఆత్రేయపురం/కాకినాడ రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో వడగాడ్పులకు గురై గురు, శుక్రవారాల్లో 13 మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజు ఆరుగురు మృతి చెందారు. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన పిల్లి రమణ (55) ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పిఠాపురం సినిమా సెంటర్‌లో కొల్లు అప్పారావు, స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద ఒక యాచకుడు, పాదగయ క్షేత్రం వద్ద లారీ డ్రైవర్, పిఠాపురం మండలం గోకివాడలో దూలపల్లి అప్పారావు (43), ఎఫ్‌కె పాలెంలోని బ్రాందీ దుకాణంలో పనిచేస్తున్న కొమ్ము వెంకటరమణ (44) వడదెబ్బకు గురై మృతి చెందినట్టు ఎస్సై ఎస్‌కె జానీ బాషా తెలిపారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో పెడూరి చిట్టిబాబు (33) గురువారం రాత్రి మృతి చెందగా, వెలమపేటలో 58 ఏళ్ల వ్యక్తి, పురుషోత్తపట్నం పంచాయతీ పరిధి రామచంద్రపురంలో కండవల్లి మంగమ్మ (88) శుక్రవారం మృతి చెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో వెలిచేరు గ్రామానికి చెందిన కూలి పనులతో జీవించే నాగిరెడ్డి రాముడు(60), నాగిరెడ్డి పనసరాముడు (75) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. కాగా ఉచ్చిలి గ్రామానికి చెందిన మాగాపు శ్రీను (45) వడగాలుల ప్రభావంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అలాగే కాకినాడ రూరల్ మండలం భావనారాయణపురం గ్రామానికి చెందిన గుర్రం అప్పన్న (38) సర్పవరం గ్రామ పంచాయతీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు. విధి నిర్వహణలో వడద్బెకు గురై పడిపోయాడు. స్థానికులు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


