ఆత్రేయపురం : రాబోయే సార్వా వరి పంట సాగు కోసం గోదావరి సెంట్రల్ డెల్టా కాలువకు జూన్ నెల మొదటి తేదీన సాగునీరు విడుదల చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక నిపుణులు పవన్ తెలియజేశారు. ఆత్రేయపురంలో సార్వా వరిసాగు కోసం మండల వ్యవసాయ అధికారి జేవి పట్టాభిరామయ్య అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం వ్యవసాయ కార్యాలయంలో జరగాల్సి ఉండగా వేసవి ఉధృతి దృష్ట్యా రైతులు హాజరు కాలేరని వ్యవసాయ అధికారులు భావించారు. దీంతో సమావేశం ఆత్రేయపురం కార్యాలయాల సమీపంలో గల చెట్ల కింద పందిట్లో నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక వ్యవసాయ అధికారి పవన్ మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడుల సాధనకు వ్యవసాయ మెలకువలు పాటించాలన్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు సంఘమిత్ర, అన్నపూర్ణ, అభ్యుదయ రైతులు ముదునూరి వెంకటరాజు, ఎం ఎస్ ఎన్ రాజు, చేకూరి కృష్ణంరాజు, దండు సత్యనారాయణ రాజు, సాగి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


