సిండికేట్‌ వ్యవస్థను రూపుమాపాలి | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌ వ్యవస్థను రూపుమాపాలి

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

ఆక్వా రైతుల నిరసన

అమలాపురం టౌన్‌: ఆక్వా రైతులు వరుస నష్టాలతో సతమవుతున్న క్రమంలో ఎక్స్‌పోర్టర్లు, మేతల కంపెనీల యాజమానులు సిండికేట్‌గా మారి ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ రైతులు అమలాపురంలో శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎర్ర వంతెన సమీపంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు అందజేశారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేతపట్టి ఆక్వా రైతులు నిరసన తెలిపారు. మొన్నటి వరకూ రొయ్యల మేతల ధరలు భారీగా పెంచేసి ఆక్వా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇప్పుడు మేతల ధరలు కొంత మేర తగ్గించారని గుర్తు చేశారు. అటు ఎక్స్‌పోర్టర్లు, ఇటు మేతల కంపెనీల యాజమానులు సిండికేట్‌ అయి ఎడాపెడా మోసం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి సిండికేట్‌ వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. రొయ్యల ధరలను పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతు ప్రతినిధులు అల్లూరి రమేష్‌రాజు, దెందుకూరి దుర్గరాజు, వేగిరాజు వెంకటరాజు, సత్తి శ్రీను, త్సవటపల్లి నాగ భూషణం, అధికారి బాబ్జి, వాసు రాజు, మోటూరి కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement