ధరల ధడేల్‌.. క్వాంటమ్‌ ఫిడేల్‌ | - | Sakshi
Sakshi News home page

ధరల ధడేల్‌.. క్వాంటమ్‌ ఫిడేల్‌

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

రోమ్‌ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు ఉంది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి అన్ని రకాల వస్తువుల రేట్లు ఆకాన్నంటి జనం అల్లాడిపోతుంటే.. షరా మామూలుగా అమరావతి, క్వాంటమ్‌ వ్యాలీ, రూ. కోట్ల పెట్టుబడులు అంటూ కాలం వెళ్లదీస్తోంది.

సాక్షి, అమలాపురం: వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొందామంటే కూర ‘గాయాలు’ అవుతున్నాయి. పాలు, పెరుగూ ఇలా వంటింట అవసరమైన అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. బయట పరిస్థితులైనా బాగున్నాయా? అంటే అదీ లేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తొలుత ఎగుమతులు నిలిచిపోయాయి. తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో అన్నిరకాల వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. ఇల్లు కడదామంటే ఇసుక, కంకర, సిమెంట్‌, ఐరన్‌ ఇలా అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి. జిల్లాలో పండించిన వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేద్దామంటే డీజిల్‌ రేటు పెరిగిందని చెప్పి మినీ వ్యాన్లు, లారీల రవాణా చార్జీలు ఏకంగా 20 శాతం పెంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెండి.. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు చేయాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కూలీ నుంచి మధ్య తరగతి.. ఉన్నత వర్గాల వరకు రూపాయి ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది.

నింగిలో నిత్యావసరాలు

● ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబంపై నెలకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ అదనపు భారం పడుతోంది. జిల్లాలో 5.13 లక్షల కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల రోజుల వ్యవఽధిలో నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం పెరిగిపోయాయి.

● గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.60 వరకు పెరిగింది. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.994 వరకు పెంచడంతో ఆ ప్రభావం పరోక్షంగా ప్రజలపై పడింది. దీనివల్ల బయట ఆహార పదార్థాల ధరలను హోటళ్ల యజమానులు పెంచేశారు. ఈ నెలలోనే రెండుసార్లు పెట్రో ధరలు పెంచారు.

పెరిగిన రవాణా చార్జీలు

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు పెరగడంతో ఆ మేరకు రవాణా చార్జీలు పెంచేశారు. దీంతో సామాన్యులపై అన్ని రకాలుగానూ భారం పడుతోంది. డీజిల్‌ లీటర్‌కు రూ.4.09 వరకు పెరిగిన విషయం తెలిసిందే. వారం రోజులలో రెండు దఫాలుగా ధరలు పెంచితే ఇదే సమయంలో కూరగాయల ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెంచారు. ఆటోల కనీస చార్జీ ప్రదేశాన్ని బట్టి రూ.20 నుంచి రూ.30 వరకూ పెరిగింది. గృహ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడి సొంతింటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రవాణా చార్జీలు పెరగడంతో జిల్లాలో సాగవుతున్న వరి, కొబ్బరి, మామిడి, అరటి, ఆయిల్‌ పామ్‌, వక్క, కోకో గింజలు, చేపలు, రొయ్యలు, కోడిగుడ్ల ఎగుమతి రైతులకు, స్థాని వ్యాపారులకు భారంగా మారింది. ఇదే సమయంలో ఎరువుల ధరలు బస్తాకు రూ.75 నుంచి రూ.300 వరకూ పెరిగి అన్నదాత వెన్ను విరిగింది.

బతుకు బండికి భారీ కుదుపు

తెలిసి వస్తున్న డీజిల్‌ దెబ్బ

కాగుతున్న నూనెలు

పెరిగిన రవాణా చార్జీలు, నిత్యావసరాలు

ఆందోళనలో సామాన్యులు, వ్యాపారులు

ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు

Advertisement
 
Advertisement
Advertisement