సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్‌లో రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా అంబటి భవాని (రామచంద్రపురం), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీగా కుసుమ శ్రీధర్(రాజోలు), రాష్ట్ర యంగ్ వింగ్ జాయింట్ సెక్రటరీగా నెల్లి సుధీర్ (రాజోలు)ను నియమించారు.
సామాజిక న్యాయం కోసమే 20 సూత్రాల అమలు
అమలాపురం రూరల్: పేదరిక నిర్మూలనకు, గ్రామీణాభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు జేసీ వైఖోడ్ నైదియాదేవి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్య శాఖ అమృత్ 2.0 జలజీవన్ మిషన్, ప్రధాన మంత్రి సూర్య ఘర్, పీఎం కుసుమ, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ మిషన్ ప్రగతి నివేదికలపై సమీక్షించారు.
వడగాడ్పులకు కూలీ మృతి
అంబాజీపేట: వడగాడ్పులకు ఓ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. పుల్లేటికుర్రు చీకురుమిల్లివారిపేటకు చెందిన చీకురుమిల్లి గోపాలకృష్ణ (35) ఈ నెల 20న కూలి పనికి వెళ్లొచ్చి.. సమీపంలోని బోర్ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో భార్య దుర్గాభవాని వెళ్లి చూడగా, బోర్ వద్ద పడి ఉన్నాడు. వెంటనే స్థానికంగా వైద్య సేవలు అందించి అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ సుభాని తెలిపారు.
మడుపల్లిలో మరొకరు..
అయినవిల్లి: మండలంలోని మడుపల్లిలో గురువారం వడగాడ్పులకు కూలీ మృతి చెందాడు. జార్ఖండ్ రాష్ట్రం బుకారో జిల్లా పిల్‌పిలోకు చెందిన బచ్చన్ మోహతా ఉపాధి కోసం మడుపల్లి వచ్చాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డ అతను పనులు ముగించుకుని తన నివాసం ఉన్న అయినవిల్లి వెళ్లుతుండగా మార్గ మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. అతని కూడా వచ్చినవారు 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీనిపై అయినవిల్లి పోలీస్ స్టేషన్‌తో ఫిర్యాదు చేశారు. బచ్చన్ మోహతాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆర్టీసీ ఎన్‌ఎంయూ
ఉద్యోగుల ధర్నా
అమలాపురం రూరల్: ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రభుత్వమే కోనుగోలు చేసి ఉద్యోగులతో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎన్‌ఎంయూ ఉద్యోగులు అమలాపురం డిపోలో గురువారం రెండోవరోజు ధర్నా నిర్వహించారు. అమలాపురం డిపోలో గ్యారేజ్ గేట్ వద్ద బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి పందిరి రాంబాబు, డిపో కార్యదర్శి పితాని మణిరాజు ఆధ్వర్యం వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వాలని కోరారు.
ఇంటి పన్నులపై
5 శాతం తగ్గింపు
అమలాపురం రూరల్: గ్రామాల్లో ఇంటి పన్నులపై ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ముందుస్తుగా ఈ నెల 31 తేదీలోపు చెల్లిస్తే 5శాతం తగ్గింపు వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి డి. శాంతాలక్ష్మి చెప్పారు. అమలాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో డీపీవో మాట్లాడారు. నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. డీఎల్‌పీఓ బొజ్జిరాజు, ఎంపీడీవో బాబ్జీ రాజు, డిప్యూటీ ఎంపీడీవోలు టీడీఏ శాస్త్రి, ఆర్‌ఎస్‌ఎస్ సురపరాజు పాల్గొన్నారు.


