అమలాపురం టౌన్: రేంజ్ అంతటా సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. నేర పరిశోధనల్లో సీసీ పుటేజీలు కీలకం అవుతున్న క్రమంలో ఈ వ్యవస్థను అన్ని దుకాణాలు, ముఖ్య కూడళ్లు, పోలీస్ స్టేషన్లు వద్ద పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం, ఆర్మ్‌డ్ రిజర్వుడు (ఏఆర్) జిల్లా కార్యాలయాన్ని ఐజీ అశోక్‌కుమార్ గురువారం తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం వద్ద గల కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీ కెమెరాలను సీఎస్‌ఆర్ నిధులు, దాతల సహకారంతో పెంచుతామని చెప్పారు. నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిజిటల్ అరెస్ట్‌లపై ఇటీవల పోలీస్ శాఖ విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో రేంజ్ పరిధిలో తగ్గు ముఖం పట్టాయని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్‌లపై స్పందించి ఎలాంటి ప్రతి పోస్ట్‌లు పెట్టవద్దని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో అనవసర యాప్‌లను, లింక్‌లను తొందర పడి ఓపెన్ చేయవద్దని సూచించారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్పీ సీఐ వి.పుల్లారావు ఆయన వెంట ఉన్నారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్


