● ప్రభుత్వాల దాడి సామాన్యుడి బతుకు భారం
● పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు
● అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం
● ఆ స్థాయిలో పెరగని తలసరి ఆదాయం,
● పంటలకు లభించని గిట్టుబాటు ధర
ఆలమూరు: జీవితం మొదలెట్టాకా చచ్చేదాకా బతక్క ఛస్తామా అని సామాన్యుడు బిత్తర చూపులు చూస్తున్నాడు. మిన్ను విరిగి మీద పడినట్టు ప్రభుత్వాలు అమాంతం ధరాభారాలను మోపుతుంటే తప్పించుకునే దారి లేక చాలీ చాలని ఆదాయాలతో బతుకునీడుస్తున్నాడు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం, పెరిగిన పెట్రో ధరలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పాల ప్యాకెట్ నుంచి పప్పుదిసుసుల వరకూ, ప్లాస్టిక్ నుంచి పెయింట్స్ వరకూ, సిమెంట్ నుంచి ఐరన్ వరకూ, చికెన్ నుంచి చేపల వరకూ, రాగి నుంచి పసిడి వరకూ ధరలు భారీగా పెరిగిపోయాయి. గృహ నిర్మాణాలు భారంగా మారాయి. రవాణా చార్జీల పెరుగుదలతో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు బాగా పెరిగాయి. ఇన్ని పెరుగుతున్నా సగటు జీవి తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలు మాత్రం అంతంతే. ఈ పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలపై రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోంది.
కృత్రిమ కొరత సృష్టి
పెట్రో ధరల పెంపును ఆసరా చేసుకుని వ్యాపారులు అన్నింటికీ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో నిత్యావసరాల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం వరకు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో వంట నూనెలు మండిపోతున్నాయి. కక్ష సాధింపు, ఓట్ల రాజకీయాలపై ఉన్న శ్రద్ధ పేద, సామాన్య, మద్య తరగతి ప్రజలపై లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరిపై క్వింటాలుకు రూ.72 మద్దతు ధర పెంచడంపై విస్మయం వ్యక్తమవుతుంది.
పెరిగిన రవాణా చార్జీలతో అధనపు భారం
పెరిగిన పెట్రో ధరలతో వాహనదారులు సుమారు పది శాతం మేర రవాణా చార్జీలు పెంచేశారు. దీనివల్ల కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఆటో కనీస చార్జి రూ.20 నుంచి రూ.30 వరకూ పెరిగింది. గృహ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి సొంతింటి కల నెరవేరడం కష్టంగా మారుతోంది. ఎరువుల ధరలు బస్తాకు రూ.75 నుంచి రూ.300 వరకూ పెరిగాయి. వాణిజ్య సిలిండర్ సుమారు రూ.100 వరకూ పెరగడంతో ఆ ప్రభావం పరోక్షంగా ప్రజలకు భారమవుతోంది.
పసిడి, వెండి ధరల భగభగ
పసిడి, వెండిపై ఉన్న ఉన్న 6 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో వాటి ధరలూ భారీగా పెరిగాయి. వెండి దిగుమతులపై నిషేధం వల్ల భవిష్యత్‌లో దాని కొరత అధికం కానుంది. రాగి, అల్యూమినియం ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. లోహాలతో తయారు చేసే అన్ని వస్తువుల ధరలు ప్రస్తుతం 20 నుంచి 50 శాతానికి పెరిగిపోయాయి.
నిత్యవసర వస్తువులు
వంటనూనెలు
నిత్యవసరాలు/ముడిసరకు (కొన్ని మాత్రమే) పాత ధర (రూపాయల్లో) కొత్త ధర (రూపాయల్లో)
బియ్యం సూపర్ ఫైన్ (కిలో) 62 69
బియ్యం గ్రేడ్–2 (కిలో) 39 46
పామాయిల్ (లీటర్లలో) 126 140
సన్‌ఫ్లవర్ (లీటర్లలో) 155 185
వేరుశనగ నూనె (లీటర్లలో) 80 210
వాణిజ్య సిలిండర్ (19 కేజీలు) 2321 3315
డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీలు) 882 942
సిమెంట్ (50 కేజీలు) 280 340
ఐరన్ (టన్ను) 72000 78000
గృహ నిర్మాణ సామగ్రి (30 నుంచి 50 శాతం)
కూరగాయలు (20 నుంచి 40 శాతం)
నిత్యావసరాలు ( 10 నుంచి 25 శాతం)
పసిడి (గ్రాముకు రూ 1200)
వెండి (గ్రాముకు రూ 60)
ఔషధాలు (10 శాతం నుంచి 30 శాతం)
ఎరువులు (బస్తా) (రూ 75 నుంచి రూ 300 వరకూ)


