పెట్రో ధరలు నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు నియంత్రించాలి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

అమలాపురం రూరల్‌: ఏఐటీయూసీ, ఆంధ్రావాలా యూనియన్‌ సంయుక్త అధ్వర్యంలో డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌పై ధరలు నియంత్రించాలని కోరుతూ అమలాపురం మండలం ఈదరపల్లి వంతెన వద్ద పెట్రోల్‌ బంకు వద్ద అదివారం ధర్నా చేశారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు, ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తిబాబు మాట్లాడుతూ 2014లో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ధరల నియంత్రణ నిధికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పెరిగిన డిజిల్‌, గ్యాస్‌ ధరలు, రవాణా భారం కేవలం వాహన యజమానుల వరకు పరిమితం కాదని అన్ని రకాల వస్తువుల పైనా పడి సామాన్యుల కొనుగోలు శక్తి సన్నగిల్లుతుందన్నారు. కార్యక్రమంలో ఊటాల వెంకటేష్‌, గూడల వెంకటరమణ, మోకా శ్రీనివాసరావు, దొంగ వీర వెంకట సత్యనారాయణ, బొమ్మి ఫణి, పుచ్చకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిబిరాలతో క్రీడా ప్రతిభ

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

యువతకు క్రీడా సామగ్రి అందజేత

అమలాపురం రూరల్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ జిల్లా యంత్రాంగం సమకూర్చిన క్రీడా సామగ్రిని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌ క్రీడాకారులకు పిలుపు నిచ్చారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం– 2026లో భాగంగా 8 నుంచి 16 ఏళ్ల వయసున్న క్రీడాకారులకు ఆదివారం ఆయన క్రీడా సామగ్రిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 60 వేసవి శిక్షణ శిబిరాలకు ఈ సామగ్రి అందజేశామన్నారు. కార్య క్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వైవీ రుద్ర, కార్యదర్శి కె. ఈశ్వరరావు, మహిళా కార్యదర్శి రమాదేవి, సీనియర్‌ వ్యాయామ సంచాలకుడు ఫణీంద్ర, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

టిప్పర్‌ ప్రమాదంలో

5కు చేరిన మరణాలు

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి

కాకినాడ రూరల్‌: కొవ్వూరు వంతెన వద్ద శనివారం జరిగిన టిప్పర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు శనివారం ఉదయం పనికి వెళ్లి, కాకినాడ బైపాస్‌ రోడ్డుపై కొవ్వూరు వంతెన వద్ద ఆన్‌లైన్‌లో మస్టర్లు వేస్తుండగా.. అత్యంత వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టి నలుగురు మృతి చెందిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన మట్టపర్తి అరుణ కుమారి (52) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆమె భర్త గోవిందు గతంలో మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లయ్యాయి. వారి వద్దనే అరుణ కుమారి ఉంటుంది. ఇటీవలే గుండె సంబంధిత వైద్యం చేయించుకున్న ఆమె.. కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగి, మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరుణ కుమారి మృతదేహానికి జీజీహెచ్‌ వద్ద ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళా కూలీ పాలిక నాగమణి అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ మంత్రి, ఆ పార్టీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు జీజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి, చీడిగ గ్రామ నాయకుడు కొప్పిశెట్టి గణేష్‌ ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం ఐదుగురికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement