వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పిలుపు
కొత్తపేట: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడటంతో పాటు అన్ని నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులపై ఆ ప్రభావం పడుతుందని, తద్వారా వాటి ధరలు పెరిగి పరోక్షంగా ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మద్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు చమురు ధరల పెంపుతో రవాణా రంగంపై పెనుభారం పడి సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పాలకులకు సూచించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌కు, డివిజన్ కేంద్రాల్లో ఆర్‌డీఓలు, ఇతర నియోజకవర్గ కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాలని సూచించారు. పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెట్రోల్, డీజిల్ వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: పీజీఆర్‌ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి ర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవనంలో డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుచేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేసి పరిష్కార స్థితిగతులను తెలుసుకోవచ్చునని సూచించారు.


