అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషేకం నిర్వహించారు. అలాగే లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. స్వామికి 11 మంది భక్తులు గరిక పూజ నిర్వహించారు. 10 మంది భక్తులు లక్ష్మీగణపతిహోమంలో పాల్గొన్నారు. ఇరువురు భక్తులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం నిర్వహించారు. ఓ చిన్నారికి నామకరణ చేశారు. 8 మంది వాహన పూజలు చేయించుకున్నారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,90,554 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


