● అర్జీలకు స్పందించని అధికారులు
● పదే పదే విన్నవిస్తున్నా పట్టించుకోని వైనం
● ప్రయోజనం లేకుండా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: పదే పదే తిరుగుతున్నాం.. సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకుంటున్నాం.. అయినా పరిష్కారం మాత్రం దొరకడం లేదని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వస్తున్న అర్జీదారులు వాపోతున్నారు. ప్రతి సోమవారం చంద్రబాబు ప్రభుత్వం అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ప్రయోజనం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఒక సమస్య పరిష్కారానికి చాలాసార్లు తిరుగుతున్నామని జనం అంటున్నారు. దీంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, తాగునీరు, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ నిడియదేవి, డీఆర్వో సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ మొత్తం 153 అర్జీలను స్వీకరించారు. ఇదిలా ఉంటే పలువురు తమ సమస్యలపై ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం రండి..
న్యాయం జరగడం లేదు
మాది ముమ్మిడివరం మండలం అనాతవరం. తమ గ్రామ సర్వే నంబర్ 276లో మా కుటుంబ సభ్యులకు 45 సెంట్ల భూమిని తల్లిదండ్రులు రాసిచ్చారు. ప్రభుత్వం చేసిన రీ సర్వేలో 40 సెంట్ల భూమి ఉందని అధికారులు నిర్ధారించారు. 5 సెంట్ల భూమి తక్కువ ఉందని పక్క రైతు నుంచి తమకు భూమిని స్వాధీనం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో ఐదు వారాలుగా ఫిర్యాదు చేస్తున్నాం. అధికారులు న్యాయం చేయలేదు. మళ్లీ ఇటీవల సర్వే చేసి మీ భూమిలో 40 సెంట్లు ఉందని సర్వే అధికారులు తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రతి సోమవారం ఫిర్యాదు చేస్తున్నా మండల సర్వేయర్ పట్టించుకోవడం లేదు.
– భూల మణికుమారి, అనాతవరం
పట్టించుకోకుంటే ఆందోళనే..
డి.రావులపాలెంలో ఇళ్ల మధ్య పీచు యంత్రాలు పెట్టి పీచు తయారు చేస్తున్నారు. దీనివల్ల దుమ్మూ ధూళితో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. పది వారాలుగా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. పరిశ్రమ శాఖ, పంచాయతీ అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. గ్రామానికి దూరంగా పెట్టుకోవాలని గ్రామస్తులు, పెద్దలు చెప్పినా ఆ యజమాని పట్టించుకోవడం లేదు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళన చేస్తాం.
– నల్లా పుల్లయ్యనాయుడు, డి.రావులపాలెం
నడవలేను.. ఆదుకోండి
నాకు పుట్టుక నుంచి రెండు కాళ్లూ లేవు. ప్రభుత్వం నుంచి మూడు చక్రాల బ్యాటరీ బండిని మంజూరు చేయాలని ఎన్నో సార్లు విన్నవించుకున్నా. 90 శాతం వికలాంగురాలిని. నేను నడవలేను. నాకు తల్లిదండ్రులు లేరు. పక్క ఇంటి దయాదాక్షిణ్యాల మీద వేరేవారి పంచన ఉండి ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛనుతో బతుకుతున్నాను. నేను బయటకు వెళ్లాలంటే ఒకరి సాయం కావాలి. అధికారులు ఇప్పటికైనా కరుణించాలి.
– రొక్కాల మరియమ్మ,
కొమరగిరిపట్నం, అల్లవరం మండలం
మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు
అల్లవరం మండలం గోడిలంక పీహెచ్‌సీ వైద్యాధికారి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల జిల్లా మలేరియా అధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లడానికి అనుమతి కోరగా, మహిళా సిబ్బందిని డాక్టర్ బాలరాజు దారుణంగా దూషించారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైద్యాధికారి మాట్లాడారు. ఆ వైద్యుడిపై సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలి. – మహిళా ఉద్యోగులు గోడిలంక
పీహెచ్‌సీ అల్లవరం మండలం


