సాక్షి, అమలాపురం: స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్నా సకాలంలో ఎన్నికలను పూర్తి చేయని చంద్రబాబు సర్కార్.. సర్పంచ్‌ల చేతుల్లో ఉన్న పవర్‌ను మాత్రం గడువు కన్నా ముందే లాగేసింది. పదవీ కాలం ముగిసే సమయంలో పాలక వర్గాలు, పంచాయతీ అధికారులు కలిసి వృథా ఖర్చులు చేస్తారనే వంకతో చెక్ పవర్‌కు ఆంక్షలు విధించింది. అలాగే పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి, తమ కనుసన్నల్లోనే చంద్రబాబు సర్కార్ పాలన సాగించనుంది. ఇప్పుడున్న సర్పంచ్‌లలో మూడొంతుల మందికి పైగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,069 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 342, కాకినాడ జిల్లాలో 385, తూర్పుగోదావరి జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు వచ్చాయి. ఏప్రిల్ రెండో తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. అయితే మరో వారం రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకోనున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారికున్న చెక్ పవర్‌పై ఆంక్షలు విధించింది. ఐదేళ్లు పాలించిన సర్పంచ్‌లు చివరి వారం రోజుల్లో వృథా ఖర్చులు చేసేస్తారని, ఇష్టానుసారం బిల్లులు చెల్లించేస్తారంటూ ఈ ఆంక్షలు విధించింది.
సర్పంచ్‌ల ఆవేదన
ఇప్పటికే చెక్ పవర్ ఉన్నా డీఎల్‌పీవో అనుమతులు తీసుకున్న తర్వాతే సొమ్ములు డ్రా చేయాల్సి వస్తోంది. జిల్లాలో బుధవారం నుంచి సర్పంచ్‌లు నేరుగా చెల్లింపులు చేయడానికి అవకాశం లేదు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) ఆమోదించాలి. సర్పంచ్ సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే మంగళవారం వరకూ నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డీడీవో లాగిన్‌కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులను పరిశీలించి థంబ్ వేస్తేనే ట్రెజరీకి చేరుతుంది. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు, సర్పంచ్‌లతో కుమ్మకై నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం ముమ్మాటికీ తమను అవమానించడమేనని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి పార్టీలకు అనుకూలమైన సర్పంచ్‌లు కూడా తప్పుపడుతున్నారు. గ్రామాల్లో చేపట్టిన పలు రకాల పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించాలన్నా అనుమతులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఎం.బుక్ నమోదు చేసిన తర్వాత కూడా అనుమానంతో బిల్లులు చెల్లింపులకు ఆంక్షలు విధించడం భావ్యంగా లేదని అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక అధికారుల జాబితా సిద్ధం
ఏప్రిల్ మూడో తేదీ నుంచి సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకునేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మండలాల వారీగా ప్రత్యేక అధికారులుగా ఎవరిని నియమించాలనే దానిపై జాబితాను సిద్ధం చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశారు. ప్రత్యేక అధికారులుగా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, ఇద్దరు ఎంఈఓలు, మండల వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, మండల పరిషత్ పరిపాలనాధికారి వంటి వారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడానికి నిబంధనలు వర్తించవు. ఎందుకంటే వారే పనులకు సంబంధించి ఎం బుక్ చెక్ మెజర్మెంట్ చేస్తారు. అందువల్ల వాళ్లకే నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కొన్ని మండలాల్లో ఎక్కువ గ్రామ పంచాయతీ ఉండటం వల్ల రెండు, మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్, మండల విద్యాశాఖ వంటి అధికారులు బిల్లులు చెల్లింపులో మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటంతో పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థపై తగినంత అవగాహన లేకపోవడం వల్ల వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపడం లేదని సమాచారం.
ఆలమూరు పంచాయతీ
వారం ముందుగానే చెక్ పవర్ రద్దు
చంద్రబాబు సర్కార్ నిర్ణయం
పంచాయతీలలో చెల్లింపులకు ఆంక్షలు
పెత్తనమంతా డీడీఓలదే
ఏప్రిల్ 2తో ముగియనున్న
పాలక వర్గాల పదవీకాలం
మూడొంతులకు పైగా వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లే


