అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా పంట కాలువలలో నీటి సరఫరాను ఏప్రిల్ 15వ తేదీ నాటికి నిలుపుదల చేసి క్లోజర్ పనులను ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 2,23,087 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. రూ.25 కోట్లతో ఆపరేషన్ మేనేజ్‌మెంట్ వర్కులు, రూ.125 కోట్లతో ఇతర పనులు, రూ.153 కోట్లతో పుష్కర పనులు నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారి వెంకటరామారావు మాట్లాడుతూ రాబోయే వేసవిలో ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, ఉష్టోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో నవ ధాన్యాల సాగు మేలు అన్నారు.
కాలువగట్లను హైవేలుగా మార్చకూడదు
కాలువ గట్లను హైవేలుగా మార్చడానికి వీలు లేదని గతంలోనే హైకోర్టు జస్టిస్ కృష్ణప్రసాద్ చారిత్రక తీర్పు ఇచ్చారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. సమావేశంంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వరల్డ్ బ్యాంకు డీపీఆర్‌కి విరుద్ధంగా 130 సంవత్సరాల క్రితం కాటన్ దొర నిర్మించిన కాలువలను ఆనుకుని జాతీయ రహదారి నిర్మాణం చేయడం మంచిది కాదన్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు హైవే కారిడార్ వల్ల కొబ్బరి చెట్లు కోల్పోవలసి వస్తుందని, దీంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు.
మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలను అరికట్టడానికి పోలీసు, ఎకై ్సజ్ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ క్షణికానందం కోసం డ్రగ్స్ వైపు వెళ్లడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనన్నారు. ఆర్డీవోలు మమ్మీ, భాగ్యవతి, డి శ్రీనివాసరావు, డీపీఓ శాంత లక్ష్మి, డీఎంఅండ్ హెచ్‌ఓ దుర్గారావు దొర, ఆర్టీసీ డీఎం డీఎల్‌ఎన్ శర్మ పాల్గొన్నారు.
పరిష్కారాలు చూపాలి
మ్యుటేషన్ 22 ఏ, రీ–సర్వే, రెవెన్యూ, పీజీఆర్‌ఎస్ క్యాస్ట్ వెరిఫికేషన్‌లపై దృష్టి పెట్టి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి అమరావతి నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీపై సమీక్షించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కుల ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్... అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ గ్రేడు క్వింటాలు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పించామని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ పి శ్రీనివాస్, అధికారి ఏ ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.


