● వాడపల్లి వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవాలు ప్రారంభం
● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ఆత్రేయపురం: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమ శాస్త్రానుసారం ఆలయ వసంత మండపంలో మధ్యా హ్నం 2.02 గంటలకు మేలుకొలుపు, నిత్యార్చన, నిత్య బలిహరణ, బాలభోగ నివేదన నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, దీక్ష ధారణ, అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఈవో దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. కాగా.. శనివారం కావడంతో ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


