ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేసి.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేసి..

Mar 29 2026 7:01 AM | Updated on Mar 29 2026 7:01 AM

తాళ్లరేవు: తన ఆస్తిని రాయించుకుని, అనాథగా వదిలివేశారంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను శనివారం విలేకర్లకు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. సుంకరపాలెం పంచాయతీ అంబేడ్కర్‌ నగర్‌ సమీపంలో నివాసం ఉంటున్న గుత్తుల వెంకాయమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఉన్న ఎకరం పొలంలో నాలుగు కుంచాల భూమిని ఇచ్చి కుమార్తెకు వివాహం చేశారు. అనంతరం వెంకాయమ్మ భర్త మృతి చెందాడు. దీంతో కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉండగా ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటితో పాటు సుమారు రూ.కోటికి పైగా విలువ చేసే 1500 గజాల స్థలాన్ని రాయించుకున్నాడు. అనంతరం ఆమెను చూడకుండా వదిలేశాడు. దీంతో వెంకాయమ్మ అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతోంది. ఇటీవల ఆమెకు సొరియాసిస్‌ రావడంతో తీవ్ర అనారోగ్యంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నానని వాపోయింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

31న రామచంద్రపురంలో జాబ్‌ మేళా

సాక్షి,అమలాపురం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కోనసీమ జిల్లా, ఎంప్లాయిమెంట్‌, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న రామచంద్రపురం శ్రీనివాస శైల ఐటీఐలో భారీ జాబ్‌ మేళా జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు తెలిపారు. సుమారు 10 ప్రముఖ కంపెనీల్లోని 380కి పైగా ఉద్యోగాలను మేళాలో భర్తీ చేస్తారన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, ఆసక్తి కలవారు అన్ని పత్రాలతో హాజరుకావాలన్నారు.

అప్పనపల్లిలో భక్తుల రద్దీ

మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ, తొలి హారతిని అర్చకులు ఘనంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి మాట్లాడుతూ ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,54,430 వచ్చిందన్నారు. స్వామివారిని 6,200 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని, నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,01,437 విరాళాలుగా అందించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement