అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 8వ తేదీన జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు, సర్వసభ్య సమావేశం జరుగుతాయి. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వైఎన్వీ కుమార్ (నీలాద్రి), రమేష్‌బాబు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేవారి నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం 1.15 గంటలకు సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కాగా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలు, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డేటా పత్రాలను వెంట తీసుకుని రావాలి. మరిన్ని వివరాలకు 89851 33338, 95508 44046 నంబర్లను సంప్రదించవచ్చు.
విఘ్నేశ్వరుని ఆలయానికి
రూ.31.48 లక్షల ఆదాయం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయ, ధర్మదాయశాఖ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 56 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ. 30,35,547, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.1,12,890 కలిపి మొత్తం రూ.31,48,437 లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు, తెలిపారు. అలాగే హుండీల్లో బంగారం 500 మి.గ్రాములు, వెండి 118 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 12 లభించాయన్నారు. దేవదాయ శాఖ అధికారులు, అర్చక స్వాములు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, పోలీసుల సమక్షంలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు.
వెంకన్నకు
వెండి శంఖం సమర్పణ
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామికి మట్టపర్తి మరిడి కుమార్, పూర్ణిమ దంపతులు, కుటుంబ సభ్యులు (ముమ్మిడివరం మండలం అన్నంపల్లి) రూ.లక్ష విలువైన 307 గ్రాముల వెండి శంఖం, ఆలయ నిత్య అన్న ప్రసాద పథకానికి రూ.10,116 విరాళం సమర్పించారు. ఈ వెండి శంఖాన్ని మంగళవారం ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషుకు స్వామివారి ఆలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ పర్యవేక్షకుడు రాంబాబు స్వామివారి ఫొటో అందించారు.
కువైట్ నుంచి స్వదేశానికి..
అమలాపురం రూరల్: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి, అక్కడ నరకయాతన పడిన కొల్లాటి ధనలక్ష్మి క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన కె.అర్జునరావు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్టా ధనలక్ష్మి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సత్తిబాబు అనే ఏజెంట్ ద్వారా 2024 అక్టోబర్ 22న కువైట్ వెళ్లింది. అక్కడ తొలుత ఒక కార్యాలయంలో, నవంబర్ 11 నుంచి ఒక ఇంట్లో పని మనిషిగా చేరింది. అయితే యజమానులు ఆమెను చిన్న కారణాలకే కొట్టడం, మా నసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఈ వేధింపుల మధ్య పని చేయలేక, తీవ్ర ఒత్తిడితో ధనలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు తెలియజేశారు. దీంతో జిల్లా యంత్రాంగం, కేసీఎం బృందం.. కువైట్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ముందుగా ఆమెను అక్కడి ఎంబసీకి తరలించి, నెల రోజులకు పైగా ఆశ్రయం కల్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జేసీ, కేంద్ర నోడల్ అధికారి టి.నిషాంతి, సమన్వయకర్త గోళ్ల రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.


