పి.గన్నవరం: ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మరించారని మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించారు. పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని, సీపీఎస్‌ను మెరుగైన రీతిలో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ప్రకారం ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ పి.శ్రీపల్లవికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాల్లో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పి.మురుగేశ్వరరావు, వరిగేటి రత్నం, యూటీఎఫ్ మండల శాఖల అధ్యక్షులు ఎన్‌వీవీ ప్రసాద్, ఎం.సూర్యనారాయణ, టి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


