● యుద్ధం పేరుతో జిల్లాలో ధరకు కోత
● గత నెలలో రూ.20 వేలు ఉండగా
నేడు రూ.13 వేల నుంచి రూ.14 వేలు
● ఇష్టారాజ్యంగా దళారుల వ్యవహారం
● మండిపడుతున్న కొబ్బరి రైతులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: బోడి గుండుకు.. మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి వనామీ రొయ్యల ధరలను తగ్గించినట్టుగానే తాజాగా దళారులంతా ఏకమై కొబ్బరి కాయ ధరలు తగ్గించేశారు. శుభకార్యాలు.. పండుగలు లేవంటూనే... మరో వైపు యుద్ధ ప్రభావం వల్ల ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయంటూ ధరలకు కోత పెట్టారు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి కొబ్బరికాయల ధరను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొబ్బరి కాయల ధరలు గణనీయంగా తగ్గాయి. వెయ్యి కొబ్బరికాయల ధర (పచ్చికాయ, నీటికాయ) ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. యుద్ధం ప్రారంభానికి ముందు దీని ధర రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు ఉండేది. యుద్ధం పేరుతో ఏకంగా రూ.మూడు వేల వరకు కోత పెట్టారు. గత నెలలో ఇవే రోజులలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు పలికేది. దానితో పోల్చుకుంటే వెయ్యి కాయలకు రూ.ఆరు వేలు తగ్గినట్టు అంచనా.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఏడాదికి సగటున 91 కోట్ల కొబ్బరి కాయల దిగుబడిగా వస్తోంది. మొత్తం మార్కెట్ పచ్చికొబ్బరి కాయ ధర మీదనే ఆధారపడుతోంది. కొబ్బరి కాయ ధర గత ఏడాది కొంత వరకు ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొబ్బరికి మంచి ధర వచ్చింది. పండగలు పూర్తయినా శుభ కార్యక్రమాలు జరుగుతున్నందున కొబ్బరికి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఉమ్మడి తూర్పు నుంచి రోజుకు 70 లారీల వరకు పచ్చి కొబ్బరి ఎగుమతి అవుతోంది. అయినా యుద్ధాన్ని బూచిగా చూపి దళారులు ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే గుజరాత్, మహారాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయ ఎగుమతులు తగ్గాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి సీజన్ ఆరంభం అవుతుండడంతో కొబ్బరి బొండాలకు డిమాండ్ వస్తోంది. కోనసీమ జిల్లా నుంచి ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి కొబ్బరి బొండాల రవాణా పెరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరుకు బొండాల ఎగుమతి జోరందుకున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మరింత పెరుగుతాయి. పండగలు లేకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గినా ఆ లోటును కొబ్బరి బొండాలు తీరుస్తాయి. ఈ విధంగా చూసినా ఇప్పుడు యుద్ధం సాకుతో ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు.
కురిడీ ధరలు రివర్స్
కొబ్బరి పచ్చికాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత నెలలో కురిడీ కొబ్బరి పాతకాయ గండేరా (పెద్దకాయ) వెయ్యి కాయల ధర రూ.31,500, గటగట (చిన్నకాయ) ధర రూ.29 వేల వరకు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.25 వేలకు, గటగట రూ.22 వేలకు తగ్గింది. ఇక కొత్తకాయ కురిడీ గత నెలలో గండేరా రూ.25 వేలు, గటగట రూ.22 వేలు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.24 వేలు, గటగట రూ.21 వేలకు తగ్గింది. కొబ్బరి కాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా తగ్గడంతో అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో నిరుత్సాహ వాతావరణం అలముకొంది.


