విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్
అమలాపురం రూరల్: కుందాలపల్లి ఘటనలో దోషులను జైలులో పెట్టాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది దళితులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టేలా లోకేష్ రెడ్‌బుక్‌లో పెట్టాలని కోరారు. బాధ్యులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదలు చేస్తున్నందు వల్లనే కోనసీమలో పదే పదే ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వికేసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ మాట్లాడుతూ ఎస్సీలపై దాడుల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే స్పందించక పోవడం వల్లే మూకలు ఈ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ఇంత వరకు కలెక్టర్, ఎస్పీ స్పందించి ఆ గ్రామంలో ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. దోషులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పి.గన్నవరం స్టేషన్‌ను ముట్టడించడంలో పది మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి నేటికీ అరెస్టు చేయకపోగా, ఒక యువకుడిని అంతు చూస్తామని బెదిరించారని జేసీ టి.నిశాంతికి వివరించారు. దీంతో ఆమె అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించారు. అనంతరం వారు ర్యాలీగా వెళ్లి ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రేవు తిరుపతి రావు, డీబీఎంఎస్ జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మాలమహానాడు నాయకులు పెయ్యల పరశురాముడు, జల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


