ప్రముఖ సినీ నేపథ్య గాయని సుశీల
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల అన్నారు. సత్కశావాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ 92 సంవత్సరాలు వయసులో తాను కాకినాడపై అభిమానం, సత్కళావాహిని సంస్థతో ఉన్న అనుబంధంతో మూడవసారి ఇక్కడకు వచ్చానన్నారు. కళల కాణాచి కాకినాడలో అభిమానుల ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 55 సంవత్సరాలుగా సత్కళావాహిని సంస్థ సంగీతానికి చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. సత్కళావాహిని వ్యవస్థాపకులు ఈవీ కృష్ణమాచార్యులు పి.సుశీలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుశీలతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, ఎస్పీ శైలజ, పీబీ శ్రీనివాసు, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజ గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు సత్కళావాహినిలో కార్యక్రమాలు నిర్వహించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని అధ్యక్షుడు గోపాల నర్సరాజు, జేఎన్టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తదితరులను సత్కరించారు.


