మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
ఇష్టారీతిన తవ్వేస్తున్నారు
పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నూతన పైపులైన్ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్‌లైన్ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.


