కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్‌కుమార్ తెలిపారు.
22న పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల జనహిత భవనంలో ఐదవ ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ (మెన్ అండ్ వుమెన్) పోటీలు–2026 జరగనున్నాయని ఆ జిమ్ కోచ్, పోటీల ఆర్గనైజర్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరగనున్న ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ క్రీడాకారుల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్‌పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు.
70 కిలోల గంజాయి స్వాధీనం
బాలుడితో సహా ఐదుగురి అరెస్టు
రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.


