సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట | - | Sakshi
Sakshi News home page

సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

– తిరుపతిలో బాధిత మహిళలనే అరెస్ట్‌ చేయడం దారుణం

– టీటీడీ చైర్మన్‌ నాయుడు రాజీనామా చేయాలి

– వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆగ్రహం

– అమలాపురంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల భారీ నిరసన

అమలాపురం రూరల్‌: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలంటూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్సార్‌ సీపీ మహిళా నాయకులపై దాడికి పాల్పడటమే కాకుండా, వారిపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ఈ అంశంపై అమలాపురంలో మంగళవారం బుద్ధ విహార్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం అరెస్టులకు నిరసనగా నల్ల రిబన్లు పెట్టికొని రోడ్డుపై ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపట్టిన మహిళా నాయకులపై పోలీసులు దాడులు చేసి, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు. తిరుమల తిరుపతి వంటి పవిత్ర క్షేత్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వివాదాస్పద వ్యవహారాల్లో చిక్కుకోవడం అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే బీఆర్‌ నాయుడును పదవి నుంచి తప్పించాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్‌ సమీపంలోని మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన పోలీసుల దాడిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్‌కుమార్‌ యాదవ్‌ డ్రగ్స్‌ వాడినట్టు పరీక్షల్లో తేలిన ఘటనను జగ్గిరెడ్డి ప్రస్తావించారు. డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని కాపాడుతూ మరోవైపు మహిళలపై దాడులు చేయడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

అత్యంత సిగ్గుచేటు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్‌ అధ్యక్షురాలు, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ తిరుమల తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న చైర్మన్‌ నాయుడు ఇటీవల ఓ మహిళతో నడిపిన వ్యవహారం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఇకనైనా కూటమి ప్రభుత్వం బీఆర్‌ నాయుడును వెనకేసుకుని రావడం మానేసి వెంటనే ఆయనను టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరిదేవి, పిల్లి సూర్యప్రకాష్‌, గన్నవరం శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్‌ నాయుడిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంకా వెనకేసుకు రావడం, ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం, పూర్తిగా గతి తప్పిన చంద్రబాబు వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబీ) ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి వెంకటేశ్వరబాబు, కుడుపూడి భరత భూషణ్‌, కాశీబాల మునికుమారి, తోరం భాస్కరరావు, అల్లవరం పార్టీ అధ్యక్షుడు సంసాని నాని, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, యిళ్ల శేషారావు, జెడ్పీటీసీ సభ్యుడు కొనుకు గౌతమ్‌, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, చింతపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌, రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు సంసాని చంద్రశేఖర్‌ (నాని) కొనుకు బాబూజీ, జిన్నూరి వెంకటేశ్వరరావు, వంగా గిరిజకుమారి, తోరం గౌతమ్‌ రాజా, మిండగుదుటి శిరీష్‌, గొల్లపల్లి డేవిడ్‌, చీకట్ల కిషోర్‌, బాకర్‌ హుస్సేన్‌, జిల్లెళ్ల రమేష్‌, సరేళ్ల రామకృష్ణ, చల్లా ప్రభాకర్‌, ఉండ్రు వెంకటేష్‌, నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్‌, మందపాటి కిరణకుమార్‌, మద్దింశెట్టి ప్రసాద్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆ అకృత్యాలు చంద్రబాబుకు కనబడడం లేదు

జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల ఆలయంలో టీటీడీ చైర్మన్‌ పదవిలో ఉన్న బీఆర్‌ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికినా, దీన్ని భక్తులు, మహిళా లోకం తప్పు పడుతున్నా, విపక్షాలు ఎత్తి చూపుతున్నా సీఎం చంద్రబాబుకు కనబడడం లేదన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఏ మాత్రం నైతిక విలువలు, సత్ప్రవర్తన లేని టీటీడీ చైర్మన్‌ నాయుడు మహిళలను లైంగికంగా వేధించే పనికిమాలిన వ్యక్తి అని అన్నారు. సీఎం చంద్రబాబు సమర్థిస్తూ ఇంకా ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ బీఆర్‌ నాయుడు తాను చేసిన ఘనకార్యాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకోవడమే కాకుండా, అప్పటికప్పుడు మూడు రకాల మాటలు మాట్లాడి ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు అన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చైర్మన్‌ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి, తప్పుకోకపోతే తప్పించాలి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement