18 మంది పురోహితులకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

18 మంది పురోహితులకు నోటీసులు

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంచలనం రేకెత్తించిన ‘పురోహితుని చేతివాటం’ వ్యవహారంలో 18 మంది వ్రత పురోహితులకు దేవస్థానం అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికం బిల్లులు తదితర అంశాలు చూసే పురోహితుడు 2024 జనవరి నుంచి 2025 నవంబర్‌ వరకూ రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. దేవస్థానం అధికారుల హెచ్చరికతో ఆ పురోహితుడు గత ఏడాది డిసెంబర్‌లో రూ.28.54 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత అతడు మృతి చెందాడు. అతడు మరో 18 మంది వ్రత పురోహితుల అకౌంట్లలో వారికివ్వాల్సిన పారితోషికం కన్నా ఎక్కువ మొతాన్ని జమ చేయించాడు. తరువాత వారికి రకరకాల కారణాలు చెప్పి, ఆ మొత్తాలను తిరిగి తన అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు. చివరకు ఆ 18 మందీ కూడా తాము అధికంగా పొందిన మొత్తాలను దేవస్థానానికి తిరిగి చెల్లించారు. మొత్తం రూ.58.39 లక్షలూ రికవరీ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ఆదేశించారు. ఈ మేరకు తమ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయినప్పటికీ అధికారుల దృష్టికి ఎందుకు తీసుకు రాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ 18 మంది వ్రత పురోహితులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై 14 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

సంచలనం రేపిన వదల బొమ్మాళీ..

వ్రత పురోహితుని చేతివాటం వ్యవహారంలో బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలపై ‘వదల బొమ్మాళీ..’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనం అన్నవరం దేవస్థానంలో తీవ్ర సంచలనం రేపింది. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై మాత్రమే చర్యలుంటాయని అందరూ భావించారు. కానీ, 18 మంది పురోహితులపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించిన విషయాన్ని ‘సాక్షి’ మాత్రమే వెలుగులోకి తెచ్చింది. దీంతో, ఆ పురోహితుల్లో ఆందోళన మొదలైంది. దీనికితోడు మంగళవారం నోటీసులు జారీ అవడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వ్రత విభాగం సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

ఏఎస్సై శ్రీనివాసరావుకు అతి ఉత్కృష్ట ఉత్తమ అవార్డు

రావులపాలెం: స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న దేవరపల్లి గంగాధర శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను మంగళవారం ప్రకటించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి శ్రీనివాసరావు ఒక్కరికే ఈ అవార్డు లభించింది. శ్రీనివాసరావును ఎస్పీ రాహుల్‌మీనా, డీఎస్పీ మురళీమోహన్‌, సీఐ శేఖర్‌ బాబు అభినందించారు.

మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం

సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్‌ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహన్‌రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement