కదలదు.. వదలదు | - | Sakshi
Sakshi News home page

కదలదు.. వదలదు

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

ప్రత్తిపాడు రూరల్‌: వారం రోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ నెల 11న ప్రత్తిపాడు మండలం ధారపల్లిలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి నుంచి బవురువాక, తాడువాయి, శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో సంచరించింది. తిరిగి జి.కొత్తపల్లి మీదుగా మైదాన ప్రాంతాన్ని వీడి.. బవురువాకలోని చిటికెల కొండ రిజర్వ్‌ ఫారెస్టుకు మంగళవారం చేరిందని అధికారులు ధ్రువీకరించారు. దీంతో, బవురువాక, తాడువాయి, కొత్త అచ్చింపేట, సింగధార, డి.పోలవరం పరిసర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సరైన ప్రదేశంలో దీనిని బంధించేందుకు అన్ని అనుమతులూ తీసుకుని, సర్వసన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఏపీ అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు బవురువాకలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అంచనాలకు అందకుండా..

మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంచరించిన బెంగాల్‌ టైగర్‌ ఎక్కడైనా పశువుపై దాడి చేస్తే.. ఆ ప్రాంతంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఆ పశు మాంసాన్ని ఆహారంగా స్వీకరించేది. ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే సంచరించేది. జనావాసాల్లోకి వచ్చిన దాఖలాల్లేవు. అయితే, ప్రస్తుతం సంచరిస్తున్న పులి స్వభావం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో ఈ పులి పూర్తిగా జనావాసాల్లోనే ఠీవిగా సంచరించింది. అయితే, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దీనివలన ప్రజలకు ఎటువంటి హానీ కలగలేదు. ఈ పులి ఇప్పటి వరకూ ఏ ప్రాంతంలోనూ 24 గంటలకు మించి నివాసం ఉండలేదు. అధికారుల ట్రాప్‌లో పడకుండా రూటు మార్చుకుంటూ ముప్పుతిప్పలు పెడుతోంది. పాపికొండలు ప్రాంతం నుంచి ఈ పులి ఇప్పటి వరకూ సుమారు 250 కిలోమీటర్లు సంచరించి, దాదాపు 15 పశువులపై దాడి చేసినట్లు సమాచారం.

ఆలయాల పరిసరాల్లో..

ఈ పులి సంచరిస్తున్న దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక్క ఆలయం ఉండటం విశేషం. ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి ఈ నెల 10న ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలాశయ ప్రాంతంలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో సంచరించింది. అక్కడి నుంచి బవురువాకలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంతానికి చేరింది. ఆ తరువాత శంఖవరం మండలం జి.కొత్తపల్లిలో పైడితల్లిమ్మవారి ఆలయ ప్రాంతంలో ఒక రాాత్రి, ఒక పగలు సంచరించింది. అక్కడి నుంచి శంఖవరంలో వేపాలమ్మతల్లి, తరువాత మండపంలో నూకాలమ్మ తల్లి ఆలయం ప్రాంగణాల్లో కనిపించింది. తిరిగి శంఖవరంలోని సత్మెమ్మ తల్లి, జి.కొత్తపల్లిలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంగణాలకు చేరింది. అక్కడి నుంచి బవురువాకలోని వాక అటవీ ప్రాంతంలోని నల్లకొండమ్మతల్లి ఆలయ పరిసరాల్లో ఈ పులి మకాం చేసింది. హిందువులు పులిని అమ్మవారి వాహనంగా కొలుస్తారు. దానికి అద్దం పట్టేలా పులి సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఫ పట్టుబడని పులి

ఫ ప్రత్తిపాడు మండలంలోనే సంచారం

ఫ బంధించేందుకు అనుమతులు తీసుకున్న

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement