ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Mar 18 2026 7:48 AM | Updated on Mar 18 2026 7:48 AM

సామర్లకోట: వేట్లపాలెం కెనాల్‌ రోడ్డులో పెట్రోల్‌ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సమీపాన పెట్రోలు బంకు ఉండటంతో ఏం జరుగుతుందోనని వేట్లపాలెం దుర్గానగర్‌ కాలనీకి చెందిన ప్రజలు కంటిపై నిద్రలేకుండా గడిపారు. ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదాన్ని గమనించిన కార్మికులు, స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమలో ఉన్న సరకు అగ్నికి ఆహుతైంది. పెట్రోలు బంకు సమీపాన ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమ ఉండటం ఎప్పటికై నా ప్రమాదమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్‌ సంఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రమాదానికి కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రాందీ షాపులో

బ్రాండ్‌ మిక్సింగ్‌ గుర్తింపు

సామర్లకోట: పెద్దాపురం సినిమా సెంటర్‌లోని ఎంఎస్‌ సాయి వైన్స్‌లో బ్రాండ్‌ మిక్సింగ్‌ జరిగిన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణ తెలిపారు. ఈనెల 15వ తేదీ రాత్రి మద్యం షాపులో తనిఖీలు చేసిన విషయం విదితమే. ఈ మేరకు విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం వివరాలను ప్రకటించారు. దీనికి సంబంధించి షాపు యజమాని, షాపులో పని చేస్తున్న వ్యక్తులపై కాకినాడ, పెద్దాపురం ఎకై ్సజ్‌ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. షాపులో అనుమానంగా ఉన్న వివిధ మద్యం బ్రాండ్‌ సీసాలను స్వాధీనం చేసుకొని రసాయన విశ్లేషణ పరీక్షకు పంపామన్నారు.

108లో మహిళ ప్రసవం

చింతూరు: పురుడు నిమిత్తం ఆసుపత్రికి తీసుకువస్తున్న క్రమంలో 108 వాహనంలో ప్రసవమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మదుగూరుకు చెందిన గర్భిణి మడకం సుబ్బమ్మకు పురుటినొప్పులు రావడంతో 108లో చింతూరు ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశావర్కర్‌ లక్ష్మి సాయంతో ఈఎంటీ అరుణ ఆ మహిళకు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా వున్నారని, వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు పైలట్‌ సురేష్‌ తెలిపారు.

ఉరివేసుకుని ఆత్మహత్య

కొత్తపల్లి: భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఒక వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన పెదపాటి శ్రీను (38) గత కొంతకాలంగా రెండో వివాహం చేసుకుని మూలపేటలో కాపురం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా శ్రీను సోమవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. దీనిపై ఎస్సై వెంకటేష్‌ అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement