అమలాపురం టౌన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అంతర్వేది రోడ్ బ్యాంక్ బ్రాంచ్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి రవికుమార్ ఇటీవల కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. అతడి కుటుంబం ఆర్థిక అవస్థలు తెలుసుకుని సహచర ఉద్యోగులు, ఎస్‌బీఐ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా అతడి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున అమలాపురం రీజినల్ పరిధిలోని 50 బ్యాంక్ బ్రాంచీల రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మృతి చెందిన ఉద్యోగి రవికుమార్ స్వగ్రామమైన మలికిపురానికి వారు మంగళవారం వెళ్లి ఆ బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్, నిత్యావసరాలను అందజేశారు. తొలుత రవికుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అమలాపురం రీజినల్ మేనేజర్ అశోక్ నాగరాజన్, ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ కార్యదర్శి వై.గణేష్, సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్వేది రోడ్ బ్రాంచి మేనేజర్ వై.విజయ్, యూనియన్ లోకల్ సెక్రటరీ టి.రామప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


