అమలాపురం టౌన్: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల కింగ్స్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈనెల 15న జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 270 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–15 విభాగంలో స్థానిక విక్టరీ అకాడమీ క్రీడాకారులు తాడి సాయివెంకటేష్, బాలికల విభాగంలో పినిశెట్టి ధరణి, అలాగే అండర్–13 విభాగంలో తామరపు ప్రసన్నకుమార్ ప్రథమ స్థానాలు సాధించారు. వీరు ఒక్కొక్కరు రూ.1,500 నగదు బహుమతులు కూడా గెలుచుకున్నారని అకాడమీ ప్రిన్సిపాల్, జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకటసురేష్ తెలిపారు. విజేతలను ఏపీ చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ తదితరులు అభినందించి ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందజేశారు.


