హోటళ్లకు ఇబ్బండలు! | - | Sakshi
Sakshi News home page

హోటళ్లకు ఇబ్బండలు!

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

అమలాపురం రూరల్‌: ఇరాన్‌ – అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్‌ కొరత ఏర్పడడంతో ఈ ప్రభావం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హోటల్‌ రంగంపై పడింది. తగినంత నిల్వలు లేకపోవడంతో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను కేంద్రం ప్రభుత్వం వారం రోజులుగా నిలిపివేసింది. దీంతో హోటళ్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్‌ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల మంది కార్మికులపై ఈ ప్రభావం పడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేక హోటళ్లు–టిఫిన్‌ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మూతపడే పరిస్థితి నెలకొంది. అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ముమ్మిడివరం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో హోటళ్లలో గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో డొమెస్టిక్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు సిలిండర్లను అధిక ధరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి వరకు డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.885 ఉంది. మార్చిలో ప్రభుత్వం రూ.56 పెంచడంతో 941కు చేరింది. డెలివరీ బాయ్స్‌ అదనంగా వసూలు చేస్తుండడంతో సిలిండర్‌ ధర రూ.1,000కి చేరింది. ప్రస్తుతం డిమాండ్‌ను బట్టి బ్లాక్‌లో రూ.1,400 నుంచి రూ.1,500 వరకు విక్రయిన్నారు. జిల్లాలోని పట్టణాల్లో 60 వరకు, గ్రామాల్లో 160 వరకు పెద్ద హోటల్స్‌ ఉన్నాయి. 400 చిన్న హోటల్స్‌ ఉన్నాయి. కోనసీమలో కేటరింగ్‌, అండ్‌ కుకింగ్‌ అసోసియేషన్‌లో పరిధిలో సుమారు 200 వంటల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటీతో పాటు వేలాది టీ పాయింట్లు, ఫాస్ట్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో నెలకు 11 వేల నుంచి 16 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తున్నారు.

మెనూలో మార్పులు

పెద్ద హోటళ్లలో మెనూలో మార్పులు చేశారు. గ్యాస్‌ పూర్తిగా లభించే సమయంలో పలు రకాల పీతలు, చికెన్‌, మటన్‌, సూప్‌లు వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేవి. వినియోగదారులు ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత వేడివేడిగా తయారు చేసి వడ్డించేవారు. ప్రస్తుతం బిర్యానీలు, చికెన్‌ కర్రీ, చేపల పులుసు, కూరగాయలు, సాంబారు వంటి వాటిని మాత్రమే తయారు చేస్తున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా అప్పటికప్పుడు కట్టెల పొయ్యిలపై చేసే వంటలు మాత్రమే మెనూలో ఉంచుతున్నారు.

ఎల్‌పీజీ ఏజెన్సీల తనిఖీకి ఆదేశాలు

ఇరాన్‌ –ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే ఎల్‌పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, ఇతర రంగాలకు మళ్లింపును నిలిపివేయాలని డీలర్లను కలెక్టర్‌ మహేష్‌ ఆదేశించారు. జిల్లాలోని 27 గ్యాస్‌ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి గృహ వినియోగదారులకు గ్యాస్‌ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. మిడ్‌–డే–మీల్‌ పథకాలు, అంగన్వాడీలకు ఎల్‌పీజీ సిలిండర్ల నిరంతరాయంగా సరఫరా చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా 94416 92275 ఫోన్‌ నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సేల్స్‌ అధికారులు వారంలో రెండు రోజులు జిల్లాలో పర్యటించి ఎల్‌పీజీ ఏజెన్సీలను తనిఖీ చేసి, ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్‌లు, పెద్ద క్యాటరింగ్‌ సంస్థలలో రోజువారీ తనిఖీలు నిర్వహించాలన్నారు. డొమెస్టిక్‌ సిలిండర్లు వాడుతున్నట్లు గమనిస్తే స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేయాలన్నారు.

సౌరశక్తితో వంట ఏర్పాట్లు : జేసీ

ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధ నేపథ్యంలో వాణిజ్య రంగానికి ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా నిలిపివేసిన కారణంగా దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నదానం, అక్షయపాత్ర కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో వంట ఏర్పాట్లు చేసుకోవాలని జేసీ టీనిషాంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, దేవదాయ ధర్మాదాయ శాఖ, నెడ్‌క్యాప్‌ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

యుద్ధం కారణంగా

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా నిలిపివేత

దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు

కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంటలు

చాలాచోట్ల మూతపడే పరిస్థితి

వేలమంది కార్మికులపై ప్రభావం

గ్యాస్‌బండ బుకింగ్‌ గడువు 25 రోజులకు పెంపు

గ్యాస్‌ కొరతను తగ్గించేందుకు గ్యాస్‌బండ బుకింగ్‌కు 21 రోజులు ఉన్న గడువును కేంద్రం ప్రభుత్వం 25 రోజులకు పెంచింది. సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వారికి 25 రోజుల తర్వాత, రెండు బండలు ఉన్నవారు 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్‌ చేసుకునే వీలు ఉంది. ఇప్పటికే వంట గ్యాస్‌ బుకింగ్స్‌ పెరుగుతుండటంతో ఆయిల్‌ కంపెనీలు కొత్త విధానం ప్రకారం చమురు సంస్థల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాయి. దీంతో సిలిండర్లు సకాలంలో రాక గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ లెక్క..

జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలు 27

సింగిల్‌ సిలిండర్లు 2,438

డబుల్‌ సిలిండర్‌ 99,879

దీపం 1,85,442

ఉజ్వల 9,581

కమర్షియల్‌ 14,72

సీఎస్‌ఆర్‌ 9,440

కనెక్షన్లు మొత్తం 5,06,252

గ్యాస్‌ కావలసిన సిలిండర్లు 34,156

ఏజెన్సీల్లో నిల్వ ఉన్న స్టాక్‌ 6,977

వీరేశ్వరుని ఆలయానికి గ్యాస్‌ సెగ

ఐ.పోలవరం: ఇరాన్‌– అమెరికా,ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలతో ఎల్‌పీజీ గ్యాస్‌ సెగ ప్రముఖ పుణ్యక్షేత్రం మురమళ్ల భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామివారి ఆలయానికి తగిలింది. నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో రోజూ సాయంత్రం స్వామివారి సామూహిక కల్యాణాలు జరుగుతాయి. ఈ కల్యాణాలకు హాజరయ్యే సుమారు 700 మందికిపైగా భక్తులకు రోజు అన్నదానం సాగుతుంది. ఇందుకు గ్యాస్‌ స్టవ్‌లపైనే వంట చేస్తారు. యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్‌ కొరత కారణంగా దేవస్థానం అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం నుంచి కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. అన్నంతోపాటు కూరలు, సాంబారు తదితర పదార్థాలను కట్టెల పొయ్యిలపైనే చేస్తున్నారు. గ్యాస్‌ కొరత లేకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో చర్యలు కనిపించడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement