ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

జిల్లాలో 99.67 శాతం మంది

విద్యార్థుల హాజరు

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన

అధికారులు

సాక్షి, అమలాపురం: పాఠశాల చదువులో విద్యార్థికి కీలకమైన పదవ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యా శాఖాధికారులు ముందు నుంచీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనివ్వడంతో..ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలు చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే నిబంధన అమల్లో ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్దకు ముందుగానే హాజరై తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. చాలాచోట్ల కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను వారి పాఠశాల వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు తరలించాయి. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల వెంట ఉండి చివరి నిమిషం వరకు తగు సూచనలిస్తూ కన్పించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరిగాయి.

19,066 మంది హాజరు

జిల్లావ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాల్లో 19,066 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు పరీక్ష 19,130 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 19,066 మంది హాజరు కాగా, 64 మంది గైర్హాజరయ్యారు. ఇంగ్లిషు మీడియం నుంచి 19,001 మంది, తెలుగు మీడియం నుంచి 65 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంగ్లిషు మీడియం నుంచి 64 మంది గైర్హాజరయ్యారు. 19,047 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, ప్రైవేట్‌గా 19 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 99.67 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

జిల్లాలోని రెండు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో కూడా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. టెన్త్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల్లో భాగంగా తొలి రోజు తెలుగు పేపర్‌ పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ రావిరాల, జిల్లా పరిశీలకులు ఎల్‌.కృష్ణఫణి, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హనుమంతరావు, ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ తనిఖీలు చేపట్టాయి. వీరంతా 52 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. కాగా తొలిరోజు జరిగిన పరీక్షల్లో ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు.

టెన్షన్‌గా..

విద్యార్థి దశలో తొలిసారిగా ఎదుర్కొనే పబ్లిక్‌ పరీక్షలు కావడంతో విద్యార్థులు టెన్షన్‌ ఫీలయ్యారు. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని, పరీక్షా కేంద్రంలో వారి నంబర్లు ఏ గదిలో కేటాయించారో సరిచూసుకున్నారు. పలువురు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వరకు పుస్తకాలతో కుస్తీ పట్టడం కన్పించింది. పలువురు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు తమ ఇష్టదైవాల ఆలయాల్లో పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement